ఆర్డర్.. ఆర్డర్... ఆర్డర్ !
న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న సమయాల్లో హద్దు మీరి ఎవరైనా మాట్లాడితే జడ్జిగారు ఆర్డర్.. ఆర్డర్.. అంటారు. ఇప్పుడు మంచు లక్ష్మీప్రసన్న ఈ మాటలనే అన్నారు. దానికి కారణం ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో ఆమె జడ్జి పాత్ర చేయడమే. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో గునపాటి సురేశ్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్షీ్ష్మ నరసింహ నిర్మించారు.
ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ- ‘‘ ఈ చిత్రకథ నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఫస్ట్ టైం జడ్జిగా ఓ ఛాలెంజింగ్ పాత్ర చేశాను. దర్శకుడు ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తయ్యేలా చేశారు. తమ్ముడు మనోజ్ నేతృత్వంలో చేసిన క్లయిమ్యాక్స్ ఫైట్ అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది.
పాటలు, ఫైట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ నెలలో పాటలు, దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని గునపాటి సురేశ్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: మల్హర్‌భట్ జోషి, కథ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సంగీతం: సునీల్ కశ్యప్, లైన్ ప్రొడ్యూసర్స్: సుబ్బారావు, ఆర్. సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి.