విజయ్‌కు గాలం వేస్తున్న యువనటి
విజయాలు ఎన్ని అందుకున్నా స్టార్‌డమ్ రావాలంటే స్టార్ హీరోలతో రొమాన్స్ చేయాల్సిందే. అదే తారక మంత్రం అని భావించిన వర్ధమాన నాయకి మంజిమామోహన్ ఆ ప్రయత్నాల్లో పడ్డట్టు కోడంబాక్కం వర్గాల మాట. మాలీవుడ్‌లో బాల తారగా పరిచయం అయిన, ఆ తరువాత కథానాయకిగా ఎదిగిన నటి మంజిమామోహన్. దర్శకుడు గౌతమ్ మీనన్ ద్వారా అచ్చయం ఎన్బదు మడమైయడా చిత్రంతో ఒకే సారి తమిళం, తెలుగు భాషలలో(తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో) పరిచయమైంది.
ఈ చిత్రం రెండు భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందడంతో మంజిమామోహన్‌కు మంచి గుర్తింపే లభించింది. కాగా ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తోంది. తదుపరి గౌరవ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా కోలీవుడ్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో నటి కీర్తీసురేశ్‌కు పోటీగా మారాలన్న కోరుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందట.
అందులో భాగంగా ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాల వేట మొదలెట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒక భేటీలో తనకు నటుడు ఇళయదళపతి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనీ, తానాయన వీరాభిమానినని చెప్పి ఆయన దృష్టి తనపై పడే ప్రయత్నం చేసింది. అదే విధంగా ఆయనతో చిత్రం చేస్తున్న అట్లీ తదితర దర్శకులను కలిసి అవకాశాలు అడుగుతున్నారు. మరి ఈ మాలీవుడ్ భామ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.