
ఆ షరతుతోనే ఈ సినిమా చేశా!
‘‘నేను నటించిన ‘మంత్ర’ సినిమా నా కెరీర్‌లోనే బెస్ట్ పిక్చర్‌గా నిలిచింది. నాకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ‘మంత్ర 2’ కథ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. కానీ కచ్చితంగా హిట్ సినిమా చేయాలనే షరతుతోనే అంగీకరించాను’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన ప్రాతలో శ్రీనివాస నాయుడు చామకూరి సమర్పణలో గ్రీన్ మూవీస్ పతాకంపై పి. శౌరి రెడ్డి, వి. యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మంత్ర 2’. ఎస్. వి.సతీశ్ దర్శకుడు. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
చార్మి తల్లి సుర్జీత్ కౌర్ పాటల సీడీలను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘మంత్ర’ సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక ఈ సినిమా చేయడానికి కొంచెం భయపడ్డా. కానీ చిత్రబృందం సహకారంతో చాలా బాగా తీయగలిగాను’’ అని చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని తానే విడుదల చేస్తున్నానని నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో చేతన్, రచయిత భాస్కర భట్ల, సహనిర్మాతలు భోనాల శ్రీకాంత్, రవితేజ, కె. సురేశ్ తదితరులు పాల్గొన్నారు.