
భయపెడుతూ.. కవ్విస్తూ...
‘మంత్ర’ చిత్రంలో ‘మాహా..మాహా...’అంటూ ఒక పక్క తన అందంతో కవ్విస్తూనే మరోవైపు భయపెట్టారు చార్మి. మళ్లీ ‘మంత్ర-2’తో ఆమె ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. గ్రీన్ మూవీస్ పతాకంపై పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.వి.సతీశ్ దర్శకుడు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. స్క్రిప్ట్‌ను నమ్మి చార్మి ఈ చిత్రంలో నటించారు. ఆద్యంతం సాగే సస్పెన్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది’’ అని నిర్మాత తెలిపారు. చార్మికి మంచి పేరు తీసుకువచ్చే చిత్రమిదని, ఆమె అభినయం ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: తనికెళ్ల రాఘవేంద్ర, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె.సురేశ్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి.