నలుపు.. తెలుపు.. నేను | Meghan Markle taking on Prince Harry’s religion before wedding | Sakshi
Sakshi News home page

నలుపు.. తెలుపు.. నేను

Published Sun, Mar 4 2018 11:34 PM | Last Updated on Sun, Mar 4 2018 11:34 PM

Meghan Markle taking on Prince Harry’s religion before wedding - Sakshi

కాబోయే భర్త బ్రిటిష్‌ యువరాజు హ్యారీతో మేఘన్‌ మార్కల్‌

మెఘన్‌ 2011లో టెలివిజన్‌ సిరీస్‌ నిర్మాత ట్రెవర్‌ ఇంజెల్‌సన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే విడాకులతో ఆ ఇద్దరూ ఆ బంధం నుంచి బయటకు వచ్చారు.

1992 అనుకుంటా...  ఎలిమెంటరీ స్కూల్‌ అమ్మాయి. పదకొండేళ్లుంటాయి. స్కూల్‌ ఇంటర్వెల్‌ బ్రేక్‌లో టీవీ చూస్తోంది. కమర్షియల్‌ వస్తోంది ఆ టైమ్‌కి.  రకరకాల వర్గాల్లోని ఆడవాళ్లు అంట్లుతోమడానికి గిన్నెలతో కుస్తీ పడుతున్నారు. అదే ట్యాగ్‌లైన్‌  ఆ యాడ్‌ కింద.. ‘‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డోడుతున్న పాత్రలతో ఫైటింగ్‌ చేస్తున్నారు’’ అని! ఆ యాడే చూస్తున్న ఆమె క్లాస్‌మేట్స్‌ అబ్బాయిలిద్దరూ ‘‘ఆడవాళ్లు అంట్లతో కాక దేనితో కుస్తీ పడ్తారు?’’ అంటూ నవ్వారు హేళనగా.  అమ్మాయి షాక్‌ అయింది. కోపమొచ్చింది. బాధా కలిగింది. అంట్లు తోమడం ఆడవాళ్ల పనేనా? ప్రశ్న ఆ చిన్న మెదడులో. మధ్యాహ్నం ఇంటికెళ్లే సరికి అది రొదలా మారింది.

ఇంట్లో...
నాన్నతో చెప్పింది పొద్దున తను చూసిన టీవీ కమర్షియల్‌.. క్లాస్‌మేట్స్‌ పాస్‌ చేసిన కామెంట్స్‌ గురించి. అంట్లు ఆడవాళ్లు మాత్రమే ఎందుకు తోమాలి? ఆ కమర్షియల్‌ను ఎందుకలా తీశారు? అన్నం అందరం తింటున్నప్పుడు అంట్లు తోమే బాధ్యతను కూడా అందరూ షేర్‌ చేసుకోవాలి కదా.. అది కేవలం ఆడవాళ్ల పనే అన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నారు? అలా ప్రమోట్‌ చేయబట్టే కదా నా క్లాస్‌మేట్స్‌ ఆడవాళ్లను అంత తేలికగా చూశారు? ఎందుకు నాన్నా ఇలా? దీన్ని మార్చాలి.. ఏదైనా చేయాలి?’’ అంది  చిన్న పిడికిలిని అంతే చిన్న అరచేతిలో నూరుతూ!  తన బుజ్జి కూతురి గొప్ప ఆలోచనకు, ఆరాటానికి ముచ్చటపడ్డాడు.

గర్వపడ్డాడు తండ్రి. ‘‘ఏదైనా చెయ్‌ మరి! పెద్దవాళ్లకు ఉత్తరం రాయు’’అని సలహా ఇచ్చాడు. ‘‘ రాస్తాను డాడ్‌’’ అంటూ తండ్రి మెడను రెండుచేతులతో చుట్టేసింది. ఆ క్షణం నుంచే  పెద్దవాళ్లు ఎవరా అని ఆలోచించసాగింది అమ్మాయి.  ఆ సమయంలో అమెరికన్‌ ప్రెసిడెంట్‌ బిల్‌క్లింటన్‌. వెంటనే ఆ పిల్లకు ఫస్ట్‌లేడీ హిల్లరీ క్లింటన్‌ గుర్తొచ్చింది.  అప్పుడు కిడ్స్‌ న్యూస్‌ ప్రోగ్రామ్‌ హోస్ట్‌ చేస్తున్న లిండా ఎల్లర్బీ, పవర్‌హౌజ్‌ అటార్ని గ్లోరియా ఆల్‌రెడ్‌లూ మనసులో మెదిలారు. ఆ ముగ్గురితోపాటు  ఆ కమర్షియల్‌లో కనిపించిన అంట్లుతోమే లిక్విడ్‌ తయారు చేసే కంపెనీకీ రాసింది.

నెల తర్వాత..
మళ్లీ ఆ కమర్షియల్‌  ప్రసారం అయింది. అయితే ఈసారి.. ‘‘అమెరికా ప్రజలంతా జిడ్డు, జిగురోడుతున్న అంట్లగిన్నెలతో కుస్తీపడుతున్నారు’’ అనే ట్యాగ్‌లైన్‌తో!  పదకొండేళ్ల అమ్మాయి మొహంలో నవ్వు! విజయంతో కూడిన నవ్వు! కిడ్స్‌ న్యూస్‌ ప్రోగ్రామ్‌ చానల్‌  యాంకర్‌ ఆ చిన్నారి ఇంటి తలుపు తట్టింది చేతిలో మైక్, కెమెరా క్య్రూతో. ఆ పిల్ల ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం! ఆ అమ్మాయి..  హిల్లరీ, లిండా, గ్లోరియా, అంట్లుతోమే లిక్విడ్‌ సోప్‌ తయారుదారు ప్రాక్టర్‌ అండ్‌ గ్రాంబుల్‌కి.. థాంక్స్‌ చెప్పుకుంది! సమానత్వం అంటే ఓ మాట కాదు.

స్త్రీ,పురుషులు ఇద్దరూ కలిసి సాధించే చేత! ఇది చర్చలకే పరిమితం కాకూడదు. కార్యాచరణకు రావాలి. ఓ పదకొండేళ్ల అమ్మాయి  చేయగలిగింది ప్రపంచంలోని ఇంతమంది ప్రజలు చేయలేరా? ఈ భూమ్మీద స్త్రీ, పురుషులిద్దరూ సమానమనే ఆలోచనాధోరణిని అలవర్చుకోలేరా? సమానత్వం మీద మాటలు ఆపి యాక్షన్‌లోకి దిగుదాం అని ప్రపంచాన్ని కోరుతోంది నాటి పదకొండేళ్ల పిల్ల.. నేటి 36 ఏళ్ల యువతిగా! ఆమె... టెలివిజన్‌ నటి.. బ్రిటిష్‌ యువరాజు హ్యారీకి కాబోయే సతీమణి.. మెఘన్‌ మార్కల్‌!

మెఘన్‌ బయోగ్రఫీ..
మెఘన్‌ మార్కల్‌ పుట్టిపెరిగింది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్‌ఏంజెల్స్‌లో. తల్లి డోరియా.. ఆఫ్రికన్‌ అమెరికన్‌. క్లినికల్‌ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్‌. తండ్రి టామ్‌..తెల్లజాతీయుడు.  సినిమాటోగ్రాఫర్‌.  టామ్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు డోరియాను చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి ప్రతిరూపంగా  ఉంటుంది మెఘన్‌. తన  పదకొండేళ్ల వయసులోనే జెండర్‌ ఇన్‌ ఈక్వాలిటీ మీద స్పందించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీ కమర్షియల్‌ యాడ్‌ను, ట్యాగ్‌లైన్‌నూ మార్చేసి అమెరికా దృష్టిని ఆకర్షించింది.

అలా బాల్యంనుంచే పోరాటస్ఫూర్తితో ఉన్న మెఘన్‌   నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌లో థియేటర్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో గ్రాడ్యూయేషన్‌ చేసింది. టెలివిజన్‌ రంగంలో అడుగుపెట్టింది. జనరల్‌ హాస్పిటల్‌ అనే షోలో గెస్ట్‌రోల్‌తో బుల్లితెరంగేట్రం చేసింది. కట్స్, ది వార్‌ ఎట్‌ హోమ్, ఎన్‌వై అండ్‌ 90210 వంటి సిరీస్‌లో నటించింది. సూట్స్‌ అనే సిరీస్‌లో రాచెల్‌ జేన్‌తో ప్రపచమంతా సుపరిచితమైంది. గెట్‌ హిమ్‌ టు ద గ్రీక్, హారిబుల్‌ బాసెస్, యాంటీ సోషల్‌ వంటి సినిమాల్లోనూ నటించింది.

బ్లాక్‌ అండ్‌ వైట్‌..
 తల్లి బ్లాక్, తండ్రి వైట్‌ కావడం,  సంప్రదాయవాదులున్న చోట బాల్యం గడవడం వల్ల ఆ వివక్షను చాలానే ఎదుర్కొంది మెఘన్‌. అది నటనా రంగంలోకి అడుగుపెట్టాక కూడా వెంటాడింది. అయితే ఎక్కడా తన ఐడెంటీటీ కల్పోలేదు. దీనికి కారణం చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన ధైర్యమే అంటుంది ఆమె. సెవెంత్‌గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఒకసారి.. ఇంగ్లిష్‌ క్లాస్‌లో తప్పక జవాబు చెప్పాల్సిన సెషన్‌  జరుగుతోంది. టీచర్‌ ఓ కాగితం ఇచ్చింది.  విద్యార్థుల వివరాలను ఆ కాగితంలోని  కాలమ్స్‌ను అనుసరించి నింపాలి.

అందులో   నలుపు, తెలుపు, లాటిన్‌ అమెరికన్, ఏషియన్‌ అని విద్యార్థుల గుర్తింపును  సూచించే గడి కూడా ఉంది.  ఆ నాలిగింట్లో పిల్లలు తాము ఏ ఉనికికి చెందిన వారైతే ఆ గడి దగ్గర టిక్‌ పెట్టాలి.  మెఘన్‌ అన్నీ వివరాలు నింపి ఆ కాలమ్‌ దగ్గర  ఆగిపోయింది. తల్లిలాంటి ఉంగరాల జుత్తు, తండ్రిలాంటి పాలిపోయిన తెలుపు ఒంటి రంగుతో ఉన్న తను ఆ మిశ్రమాన్ని ఏ గడిలో పెట్టాలో తెలియక ఏమీరాయకుండా లాగే ఉండిపోయింది. మెఘన్‌ అవస్థ గమనించిన టీచర్‌.. తెల్లగా ఉన్నావు కాబట్టి వైట్‌ దగ్గర టిక్‌ పెట్టు అని సలహా ఇచ్చింది.

మరి అమ్మ పోలికలూ ఉన్నాయి కదా! వైట్‌ను తన ఉనికిగా చెప్పుకోవడానికి ఆ పిల్ల  మనసు అంగీకరించలేదు. దాంతో ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేసింది. దిగులు మొహంతో ఇంటికెళ్లింది. తండ్రి అడిగాడు ఏమైంది అని. చెప్పింది. ఈసారి అలాంటి సంకటం వస్తే.. సందేహపడకుండా.. నీ సొంత ఐడెంటీనే చెప్పు అన్నాడు దగ్గరకు తీసుకొని. ఆ మాటంటున్నప్పుడు తన కూతురి చిన్నమెదడు ఎంత అయోమయాన్ని అనుభవించిందో అర్థం చేసుకున్నాడు.

అది సృష్టించిన వ్యవస్థ పట్ల కోపం అతని మొహాన్ని ఎర్రబర్చడం ఆ బిడ్డ దృష్టిలో పడకపోలేదు. సొంత ఐడెంటిటీ గురించి తండ్రి చెప్పిన మాట ఆ రోజు నుంచి మైండ్‌లో అచ్చేసుకుంది.  జ్ఞానాన్ని మించిన శక్తి లేదు.. సాధికారతను మించిన ఐడెంటిటీ లేదని తెలుసుకుంది. తర్వాత సాధికారతనే తన గుర్తింపుగా మార్చుకుంది మెఘన్‌.అందుకే ‘నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే వివరం చెప్పాల్సి వస్తే... స్ట్రాంగ్, కాన్ఫిడెంట్‌ మిక్స్‌డ్‌ రేస్‌ ఉమన్‌’’ అని గర్వంగా చెప్తాను అంటుంది.  

నటన నుంచి రచన దాకా..
మెఘన్‌.. తన తల్లిలా యోగానిపుణరాలు. మంచి కుక్‌. ఎల్లే యూకే మ్యాగజైన్‌కు వ్యాసాలూ రాస్తుంది.  తన లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్‌ అయిన ‘ది టిగ్‌’కు ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించింది. సంఘసేవిక. యూఎన్‌ విమెన్స్‌ అడ్వకేట్‌. వరల్డ్‌ విజన్‌ కెనడాకు గ్లోబల్‌ అంబాసిడర్‌. కాలీగ్రాఫర్‌ కూడా. నటనలోకి వచ్చేముందు కాలిగ్రఫే ఆమెకు ఆదాయమార్గం. వెడ్డింగ్‌ ఇన్విటేషన్స్‌ రాసేది.

జెండర్‌ ఈక్వాలిటీకి సంబంధించి యూఎన్‌ఓతో కలిసి జెండర్‌ ఈక్వాలిటీ మీద ఎంతో కృషి చేసింది. పని పట్ల ఆమెకున్న అంకితభావానికి, నిబద్ధతకు అదే  ప్రతీక. 2015, ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే రోజు మెఘన్‌ ప్రసంగం ప్రేక్షకులతో సహా యూఎన్‌ సెక్రటరీ జెనరల్‌ బాన్‌ కీ మూన్‌నూ అమితంగా ఆకట్టుకుంది. ఆయనతో సహా ఆ సభంతా ఇచ్చిన స్టాడింగ్‌ ఒవేషనే  అందుకు నిదర్శనం.

ప్రిన్స్‌ హ్యారీతో..
 కెనడాలోని టొరంటోలో.. ఇన్‌విక్టస్‌ గేమ్స్‌ జరుగుతున్నాయి. హాజరుకావడానికి వచ్చాడు ప్రిన్స్‌  హ్యారీ.  మెఘన్‌ నటించిన  ‘సూట్స్‌’ షూటింగ్‌ అయిందీ అక్కడే. అలా ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. డేటింగ్‌ స్టార్ట్‌ అయింది. ప్రేమ ఫిక్స్‌ అయింది. వీరి రొమాన్స్‌ ఆన్‌లైన్‌లో షికారూ  చేసింది.  2017, నవంబర్‌ తొలినాళ్లలో తమ నిశ్చితార్థం జరిగిపోయినట్లు’ నవంబర్‌ నెల ఆఖరున ప్రకటించారు ప్రిన్స్‌ హ్యారీ, మెఘన్‌ మార్కల్‌. ఆ తర్వాత కొన్ని వారాలకు.. ‘‘2018, మే 19న ప్రిన్స్‌ హ్యారీకి, మెఘన్‌ మార్కల్‌కు వివాహం జరగనున్నట్టు కెన్సింగ్‌టన్‌ ప్యాలేస్‌ అనౌన్స్‌ చేసింది. విండ్సర్‌ కేసిల్‌లోని సెయింట్‌ జార్జెస్‌ చాపెల్‌ ఈ పెళ్లికి వేదికకానుంది. ‘‘రెఫ్యూజీ క్యాంప్స్‌ నుంచి రెడ్‌ కార్పెట్‌కి షిఫ్ట్‌ అయింది నా జీవితం. ఈ రెండు దశలనూ గౌరవిస్తాను. ఎందుకంటే ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే.  ఈ రెండూ నాకు ముఖ్యమే. నిజానికి అవసరం కూడా!’’ అంటుంది స్ట్రాంగ్, కాన్ఫిడెంట్‌ మిక్స్‌డ్‌ రేస్‌ ఉమన్‌ మెఘన్‌ మార్కల్‌.
– శరాది


                          మేఘన్‌ మార్కల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement