
'ఒంటరిగా ఉన్నా.. అబ్బాయిలను లైన్‌లో పెట్టాలి'
లాస్ ఏంజిల్స్: ప్రతిభ ఉంది. పేరు ప్రఖ్యాతలూ ఉన్నాయి. కావాల్సినంత డబ్బూ ఉంది. అయినా తాను ఇప్పటికీ ఓ తోడులేక ఒంటరిగా ఎందుకు ఉన్నానో అర్థం కావడం లేదు అంటోంది హాలీవుడ్ సింగర్ మేఘన్ ట్రైనర్. తాను ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నా.. తన దగ్గరికి వచ్చేందుకు అబ్బాయిలు తెగ భయపడిపోతున్నారని ఈ 22 ఏళ్ల అమ్మడు వాపోతున్నది.
'నాకు ఇప్పటికీ ఓ తోడు దొరకలేదు. నేను అంతగా వెలుగులోకి రాకముందు నన్ను అబ్బాయిలు చూసేవారు. ఎప్పుడూ నా చుట్టూ తిరిగేవారు. నన్ను ఆకర్షించేందుకు ప్రయత్నించేవారు. కానీ నేను ఫేమస్ అయిన తర్వాత అబ్బాయిలు నన్ను చూడటమే మానేశారు. ఒకవేళ చూసినా భయపడుతున్నారు. ఇది కష్టంగా ఉంది. నేనేమైనా వికారంగా ఉన్నానా? నేను అందంగా లేనా? అన్న భావన కలుగుతోంది. కానీ నేను సూపర్ కూల్‌గా చాలా అందంగా ఉంటాను. నేను మంచి డ్రెస్‌లు వేయలేదు. ఇకముందు అబ్బాయిలను లైన్‌లో పెట్టాలి' అని ఈ భామ పేర్కొన్నట్టు 'పీపుల్' మ్యాగజీన్ తెలిపింది.
హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో లాంటి వ్యక్తితో డేటింగ్ ఇష్టపడతానని, ఆయన నటనంటే తనకెంతో ఇష్టమని, ఆయనతో డేటింగ్ చేస్తే అమేజింగ్‌గా ఉంటుందని గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈ సింగర్ చెప్పుకొచ్చింది.