మైకేల్ జాక్సన్ రేడియో చానల్
పాప్ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాజు మైకేల్ జాక్సన్. ఆయన పాటలకు చెవి కోసుకోనివారు ఉండరంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మధురమైన కంఠస్వరం, స్ప్రింగ్‌లాంటి దేహంతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ పాట రూపంలో జీవించే ఉన్నారు. భౌతికంగా దూరమైనా ఆయన మాత్రం అభిమానులగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన దుస్తులు, వస్తువులు వేలానికి పెడుతుంటే కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. అలాగే, మైకేల్ అసంపూర్తిగా వదిలేసిన ఆల్బమ్స్ కూడా భారీ ఎత్తున అమ్ముడుపోవడం విశేషం. ఆయన అసంపూర్తిగా వదిలేసిన ఆల్బమ్స్‌లో ‘ఎస్కేప్’ ఒకటి.
ఈ ఆల్బమ్‌ని పునర్నిర్మించి, విడుదల చేశారు. దీనికి నిర్మాతగా టింబాలాండ్ వ్యవహరించారు. ఎనిమిది పాటల సమాహారంతో ఉన్న ఈ ఆల్బమ్ 50 దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల క్రితం ఈ ఆల్బమ్‌ను విడుదల చేశారు. అదే రోజున మైకేల్ జాక్సన్ పేరుతో ఓ రేడియో చానల్‌ను ఆరంభించారు. బహుశా ప్రపంచంలో ఏ ప్రముఖునికీ ఇలాంటి ఘనత దక్కి ఉండదు. ఈ ఎఫ్‌ఎమ్ చానల్‌లో 24 గంటలూ మైకేల్ హిట్ పాటలను ప్రసారం చేస్తారు. కేవలం రెండు వారాలు మాత్రమే ఈ చానల్ ఉంటుంది. మైకేల్ అభిమానులందరూ ఈ 15 రోజులూ రేడియోకు అతుక్కుపోవడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.