
‘పద్మశ్రీ’ని తిరిగిచ్చేయండి
మోహన్‌బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు సూచన
‘పద్మ’పురస్కారాల దుర్వినియోగంపై అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ‘పద్మ’ పురస్కారాలు దుర్వినియోగం అవుతున్నాయుంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతికి తిరిగి స్వాధీనం చేయాలని ప్రముఖ నటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు, హాస్యనటుడు బ్రహ్మానందంలకు హైకోర్టు సూచిం చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామంటూ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ‘దేనికైనా రెడీ’ సినిమా టైటిల్స్‌లో మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్ల ముందు ‘పద్మశ్రీ’ని ఉపయోగించుకోవడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్రహ్మానందానికి సినిమాయేతర వ్యవహారాలతో సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది మాదిరాజు శ్రీనివాసరావు కోర్టుకు నివేదించారు. సినిమా ప్రదర్శన సమయంలో మోహన్‌బాబు పేరు ముందు పద్మశ్రీ ఉపయోగించినందుకు దేనికైనా రెడీ చిత్ర నిర్మాత క్షమాపణ చెబుతూ లేఖ కూడా పంపారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది వి.కృష్ణమోహన్ విన్నవించారు. పేరుకు ముందు పద్మశ్రీ ఉపయోగించడం ఉద్దేశపూర్వకంగా జరగలేదన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఈ విధంగా చేయకూడదని చట్టం నిర్దేశించినపుడు అది తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే’’ అని వ్యాఖ్యానించింది. ఇంతకీ సినిమా నిర్మాత ఎవరని ప్రశ్నించగా.. విష్ణువర్ధన్ అని, ఆయన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అని కృష్ణమోహన్ సమాధానమిచ్చారు. ఈ సంస్థ తరఫున కూడా తానే హాజరవుతున్నానని చెప్పారు. అయితే నిర్మాత తరఫున గజేంద్రనాయుడు అనే వ్యక్తి వకాలత్‌పై సంతకం చేయడాన్ని గుర్తించి, అసలు ఇది ఏ తరహా కంపెనీ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేట్ లిమిటెడ్ అని న్యాయవాది సమాధానమిచ్చారు. ఇటువంటి కంపెనీల్లో సహజంగా కుటుంబసభ్యులే కీలకంగా ఉంటారని, ఈ కంపెనీ కూడా మోహన్‌బాబు కుటుంబానికే సంబంధించినదై ఉంటుందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తామని, ఆ కంపెనీకి సంబంధించి కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్వోసీ) నుంచి వివరాలు తెప్పించుకుం టామని తెలిపింది. మోహన్‌బాబు తదితరులను కోర్టుకు పిలిపించి స్వయంగా విచారిస్తామంది. ‘‘మీ కక్షిదారుల (మోహన్‌బాబు, బ్రహ్మానందం)కు చెప్పండి. వారు పొందిన పద్మశ్రీ అవార్డులను తిరిగి స్వాధీనం చేయూలని. ఇలా చేయడం ద్వారా వారు అవార్డుల హుందాతనాన్ని కాపాడిన వారవుతారు’’ అని న్యాయవాదులతో వ్యాఖ్యానించింది.
అవి బిరుదులు కావు: సుప్రీంకోర్టు
భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు బిరుదులు కాదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఈ నాలుగు అవార్డులు బిరుదులుగా పరిగణించాలా? వద్దా? అనే అంశంపై ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం 1995 డిసెంబర్ 15న తీర్పు వెలువరించింది. ఈ పురస్కారాలను తవు పేర్ల ముందు గానీ, ఇంటి పేర్లుగా గానీ వినియోగించరాదని తేల్చి చెప్పింది.
ఒకవేళ ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారు ఆ అవార్డును వెనక్కి ఇచ్చివేయాలని స్పష్టం చేసింది. దీనికన్నా ముందు 1968 ఏప్రిల్ 17న ఈ నాలుగు అవార్డుల జారీకి సంబంధించి కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ అవార్డులను లెటర్‌హెడ్‌లు, విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, పుస్తకాలపై ఉపయోగించరాదు. అంతేకాక అవార్డు గ్రహీతలు తమ పేర్లతో కూడా వీటిని కలిపి ఉపయోగించకూడదు. అలా చేస్తే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’’ అని స్పష్టంగా పేర్కొంది.