వారంలోగా పద్మశ్రీ అవార్డులు తిరిగి ఇచ్చేయండి
హైదరాబాద్ : పద్మశ్రీ వివాదం కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. 'దేనికైనా రెడీ' చిత్రానికి మోహన్‌బాబు గౌరవ నిర్మాతేనని.. నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దేనికైనా రెడీలో బ్రహ్మానందం నటించారా అని ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదిని ప్రశ్నించగా.. బ్రహ్మానందం నటించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దేనికైనా రెడీ సినిమా టైటిల్స్‌లో మోహన్‌బాబు, బ్రహ్మానందం తమ ఇంటిపేరుకు బదులుగా పద్మశ్రీ అవార్డు పేరు పెట్టుకోవడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది.
వారం రోజుల్లోగా తమకున్న పద్మశ్రీ అవార్డులను తిరిగిచ్చెయ్యాలని.. సినీనటుడు బ్రహ్మానందం, మోహన్‌బాబులను ఆదేశించింది. సెన్సార్ బోర్డు తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలు వీరు పాటించడం లేదని న్యాయస్థానం మండిపడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. టైటిల్స్‌లో ఇంటిపేరుకు బదులుగా అవార్డు పేరును వాడుకోవడం తప్పన్న పిటిషనర్ బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. 2007లో మోహన్ బాబుకు, 2009లో బ్రహ్మానందంకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.