మోహన్‌బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: ‘పద్మశ్రీ’ పురస్కారం ఉపసంహరణకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న సినీనటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది.
గతంలో మరేదైనా సినిమాలో పేరుకు ముందు ‘పద్మశ్రీ’ని వాడి ఉంటే అక్కడా తొలగించాలన్న ఆదేశాలను తాము అమలు చేశామని మోహన్‌బాబు రాతపూర్వకంగా నివేదించారు. దానిని పరిశీ లించిన ధర్మాసనం... ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ విచారణను ముగించింది. ‘దేనికైనా రెడీ’ సినిమాలోనేగాక, ‘ఝుమ్మంది నాదం’ సినిమాలోనూ పద్మశ్రీని పేరుకు ముందు ఉపయోగించారని, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిల్ దాఖలు చేయడం తెలిసిందే.