రియలిస్టిక్ రౌడీయిజం
అసలు సిసలైన రౌడీయిజాన్ని తెలుగువాళ్లు తెరపై చూసింది ‘శివ’లోనే. జనాలు నాటకీయతను ద్వేషించడం, నిజాన్ని ఇష్టపడటం అప్పట్నుంచే మొదలైంది.
గల్లీ రౌడీయిజం నుంచి ఢిల్లీ పేలుళ్ల వరకూ ఏదైనా సరే... రామ్‌గోపాల్‌వర్మ చూపిస్తే... అది వాస్తవానికి అద్దమే. అందుకే తెలుగువాడు గర్వించదగ్గ దర్శకుడయ్యారాయన. ‘నటనంటే... బిహేవ్ చేయడమే’ అంటారు వర్మ. అందుకే, అమితాబ్ లాంటి మహానటులు సైతం ఆయనతో పనిచేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. వర్మలో సత్తా ఇసుమంతైనా తగ్గలేదనడానికి ఆ మధ్య విడుదలైన ‘26/11’ సినిమానే ఉదాహరణ.
సరైన కాన్సెప్ట్ పడితే... వర్మ మెరిసినట్లు ఎవరూ మెరవలేరు. ఇదిగో.. ఇక్కడున్న మోహన్‌బాబు ‘రౌడీ’ ఫస్ట్‌లుక్ చూడండి. మళ్లీ వర్మ మెరుపులు కనిపిస్తాయి. ‘రౌడీ’గా మోహన్‌బాబు కనిపించడం కొత్తేమీ కాదు కానీ... వర్మ సినిమాలో ఆయన రౌడీయిజం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. తన పాత్రను వర్మ తీర్చిదిద్దుతున్న తీరు అద్భుతమని మోహన్‌బాబు కూడా అంటున్నారు.
మంచు విష్ణు మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది. నిర్మాతలు పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘పెదరాయుడు, రాయలసీమ రామన్నచౌదరి తర్వాత మోహన్‌బాబు పూర్తిస్థాయి రౌద్రపూరితమైన పాత్ర చేస్తున్న సినిమా ఇది. విగ్ లేకుండా రియలిస్టిక్‌గా నటించారాయన. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మోహన్‌బాబుకు జోడీగా జయసుధ, విష్ణు సరసన శాన్వి నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత దర్శకుడు.