
...సెట్‌లో ఎటు చూసినా హనుమంతుడి నామస్మరణే! 50 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం.. నాలుగు వందలమంది డ్యాన్సర్లు.. సుమారు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు.. మధ్యలో మోహన్‌బాబు. ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య చెప్పినట్టు స్టెప్పులేస్తున్నారు. హనుమంతుణ్ణి ప్రార్థిస్తు్తన్నారు. అసలు విషయం ఏంటంటే... మోహన్‌బాబు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘గాయత్రి’. మదన్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సిన్మా చిత్రీకరణ తిరుపతిలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ‘జయ హనుమ... జై జై హనుమ’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు.
సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటకు తమన్ సంగీతమందించగా, శంకర్ మహదేవన్ పాడారు. ‘‘ఈ పాటతో 50 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. కళా దర్శకుడు చిన్నా రూపొందించిన ఆంజనేయస్వామి విగ్రహం పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్రనిర్మాణ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి ఫైట్స్: కనల్ కణ్ణన్, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: ఎస్.ఎస్. తమన్.