తిరువనంతపురం: తీవ్ర దుమారం రేపిన అసోసియేషన్ ఆఫ్ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) నిర్ణయంపై అధ్యక్షుడు మోహన్‌లాల్ ఎట్టకేలకు స్పందించారు. నటుడు దిలీప్ ఆ నిర్ణయం ఏకపక్షంగా తీసుకుంది కాదని ఆయన స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న ఆయన ఈమేరకు మీడియాకు శనివారం ఓ లేఖ రిలీజ్ చేశారు.
‘‘‘అమ్మ’ మహిళా వ్యతిరేకి అన్న ఆరోపణలు సబబు కాదు. అసోషియేషన్‌లో ఏకీకృత విధానాలే అమలవుతుంటాయి. దిలీప్‌పై వేటు ఎత్తివేత నిర్ణయం నేనొక్కడినే తీసుకోలేదు. అది సభ్యులంతా సమీక్షించి తీసుకుంది. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది నిజం కాదు’’ అంటూ ఓ పెద్ద వివరణతో కూడిన లేఖను మోహన్‌లాల్ విడుదల చేశారు. కాగా, అమ్మ అధ్యక్షుడిగా కొలువుదీరిన వెంటనే మోహన్‌లాల్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ దుమారం రేపింది. భావన ఉదంతం సమయంలో మోహన్‌లాల్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఆడపడుచులంతా తన అక్కచెల్లెళ్లతో సమానమని, వారికి ద్రోహం జరిగితే చూస్తూ ఉపేక్షించబోనని వ్యాఖ్యానించారు. అంతేకాదు దిలీప్ అరెస్ట్ అయిన వెంటనే అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.
అయితే ఎనిమిది నెలల తర్వాత దిలీప్ బయటకు రావటం, తిరిగి సినిమాలు చేసుకుంటుండటంతో తిరిగి ఇప్పుడు నిషేధం ఎత్తేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక కొందరు నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. పైగా అమ్మ సభ్యుల సంభాషణతో కూడిన ఓ ఆడియో క్లిప్ వాట్సాప్ వైరల్ అయి దుమారం రేపింది. రాజీనామాల పేరుతో హీరోయిన్లు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారంటూ ఆ క్లిప్‌లో ఉంది. దీంతో వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(డబ్ల్యూసీసీ) అమ్మపై మండిపడింది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ముదరక ముందే మోహన్‌లాల్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment