కెరీర్‌లోనే.. అతి క్లిష్టమైన పాత్ర
అందం... అభినయం... మంచితనం... ఈ మూడూ ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. అలాంటి అరుదైన నటి - సమంత. కావాల్సిన వాళ్ళంతా ‘శామ్’ అని ముద్దుగా పిలుచుకొనే ఆమె ఆ మధ్య ‘మనం’ చిత్రంతో, ఇటీవల ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ మాట ఆమే స్వయంగా పేర్కొన్నారు. తమిళనాట హీరో విక్రమ్ సరసన నటిస్తున్న ‘పత్తు ఎణ్రదుకుళ్ళ’ (‘పది లెక్కపెట్టే లోపల’ అని అర్థం) చిత్రంలో సోగకళ్ళ శామ్ కథానాయిక.
ఇటీవలే విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఆంతరంగిక వర్గాల కథనం ప్రకారం ఈ చిత్రంలో సమంత ఒకటి కాదు... ఏకంగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు అత్యంత కీలకమైన ఈ ద్విపాత్రాభినయానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఆ వివరాలేమీ సమంత స్వయంగా వెల్లడించకపోయినప్పటికీ, ‘ఇప్పటి దాకా నాకు వచ్చిన అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఇది ఒకటి’ అని స్వయంగా ప్రకటించారు. క్లిష్టమైన పరిస్థితులు, సవాళ్ళు ఎదురైనప్పుడే కదా... సమర్థుల ప్రతిభ మరింతగా బయటకొచ్చేది. ఆల్ ది బెస్ట్ శామ్!