సినిమా రివ్యూ: జోరు | movie review : joru cinema | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: జోరు

Published Sat, Nov 8 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

సినిమా రివ్యూ: జోరు

సినిమా రివ్యూ: జోరు

తారాగణం: సందీప్ కిషన్, రాశీఖన్నా, సుష్మా, ప్రియాబెనర్జీ, కథ: విక్రమ్రాజ్, సంగీతం: భీవ్‌ు సిసిరోలియా, నిర్మాతలు: అశోక్, నాగార్జున, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
 

బలాలు: 
ఒకరికి ముగ్గురు హీరోయిన్లు ఉండడం  
మాస్ మెచ్చే ఐటెమ్ సాంగ్ 
మెలొడీ పాట ‘పువ్వు లకు రంగెయ్యాల...’ చిత్రీకరణ
 

బలహీనతలు: 
పాత చిత్రాల్ని గుర్తుచేస్తూ గజి బిజిగా అల్లుకున్న కథ
పాత్రల మధ్య సమన్వయ లేమి 
పాత్రల కన్‌ఫ్యూజన్ ప్రేక్షకులకూ విస్తరించడం
ఎడిటింగ్


ఒకరి స్థానంలోకి మరో పాత్ర వచ్చి, విలన్‌ను బురిడీ కొట్టించడమనే బాక్సాఫీస్ ఫార్ములా విజయానికి మంచి సూత్రమే. కాకపోతే, స్క్రిప్టును సమర్థంగా రాసుకోకపోతే, ప్రేక్షకులు కన్విన్‌‌స అయ్యేలా చెప్పలేకపోతే అది గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది. ఒకరి స్థానంలో మరొకరిని పెట్టడమనే సూత్రంలోనే వచ్చిన సినిమా - ‘జోరు’.

కథ ఏమిటంటే: విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైవ్‌ులో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా.
 ఎలా నటించారంటే: ఉడికీ ఉడకని కథతో చేసిన ఈ చిత్రంలో హీరో పాత్ర అన్నీ తెలిసిన సూపర్‌మాన్‌లా ప్రవర్తిస్తుంటుంది.

సందీప్‌కు కావాల్సినంత ఎనర్జీ ఉన్నా అతనికే మాత్రం సరిపడని పాత్ర ఇది. అతని నటనలో సొంత శైలి కంటే ఇతర హీరోల ప్రభావం కనిపించింది. ఒకరికి ముగ్గురు హీరోయిన్లు ఉండడం చూడడానికే తప్ప,  కథకు పనికొచ్చింది తక్కువ. బ్రహ్మానందం, సప్తగిరి ఒకటి రెండు చోట్లే వినోదింపజేశారు. ఎలుగుబంటికి సంగీతం నేర్పించే ఎపిసోడ్ లాంటివి పెద్ద ఫార్సు. సాయాజీ షిండేకు కొడుకు పాత్ర (నటుడు అజయ్)... చిత్ర దర్శకుడు అనుకున్నప్పుడల్లా వచ్చి, అర్ధంతరంగా అదృశ్యమైపోతుంటుంది.

ఎలా ఉందంటే:  విషయం లేకుండానే ఫస్టాఫ్ అంతా నడుస్తుంది. అయితే, ఆసక్తికరమైన ట్విస్ట్ దగ్గర ఇంటర్వెల్ వస్తుంది. ఆ ట్విస్ట్ ముడివిప్పి, విలన్‌ను హీరో మట్టికరిపించడమనే కీలకమంతా సెకండాఫ్ లోనే. అక్కడే దర్శక, రచయిత విఫలమయ్యారు. ఎంచుకున్న కథలోనే కాక, కథనంలో కూడా విషయలేమి తెలిసిపోతుంటుంది. పతాక సన్నివేశంలో అది మరీ కనిపిస్తుంది. దాంతో, ప్రేక్షకులకు చివరకు అసంతృప్తి మిగులుతుంది.

పాత్రలు వాటి మధ్య కాకుండా, మనల్ని చూస్తూ మనసులో మాట్లాడుకోవడమే ఈ సినిమాలో ఎక్కువ. అనవసరమైన కార్టూన్ యానిమేషన్లు, సందర్భం లేకుండా అడ్డంగా వచ్చే పాటలు సరేసరి. కథలు రాసుకొని సినిమా తీయడమనే పద్ధతి కన్నా సినిమాలు చూసి సినిమాలు తీయడమనే పాపులర్ పద్ధతిలోని సౌకర్యాన్ని చిత్ర రూపకర్తలు చక్కగా వినియోగించుకున్నారు. కథలో పాత్రల మధ్య ఉన్న గందరగోళం అంతకన్నా ఎక్కువగా దాన్ని తెరపై చూస్తున్న ప్రేక్షకులకు కలుగుతుంది.

కొన్ని సినిమాలకు కథ ఏమిటని అడగకూడదు. సినిమా చూసినా, అది గుర్తూ ఉండదు. గుర్తుంచుకోవడానికీ ఏమీ ఉండదు. బహుశా, ఆ జాబితాలో ఒకటిగా ‘జోరు’ను ప్రేక్షకులు వర్గీకరిస్తే తప్పుపట్టలేం. ఇది ‘గుండెల్లో గోదారి’ లాంటి మంచి చిత్రం రూపొందించిన దర్శకుడి ద్వితీయ ప్రయత్నం కావడం వాణిజ్య సూత్రాల బరిలో బందీ అవుతున్న సినీ సృజనాత్మకతకు విషాద తార్కాణం.
 
రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement