నటీనటులు: సాయిధరమ్ తేజ్, రెజీనా, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, షియాజీ షిండే తదితరులు.
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాత బన్నీ వాసు
దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరీ
ప్లస్ పాయింట్స్‌ః
స్క్రీన్ ప్లే, డైరక్షన్
సాయిధరమ్ తేజ్ ఎనర్జీ
రెజీనా గ్లామర్, ఫెర్ఫార్మెన్స్
మ్యూజిక్
కెమెరా
మైనస్ పాయింట్స్:
చివరి 10 నిమిషాలు
ముఖ్యమంత్రి పదవికి ప్రభాకర్ (ప్రకాశ్ రాజ్), గంగాప్రసాద్ (షియాజీ షిండే) రేసులో ఉంటారు. ఈ పదవి కోసం ఇద్దరూ పావులు కదుపుతుండగా గంగాప్రసాద్ అక్రమ వ్యవహారాలపై ఓ టీవీ చానెల్‌కు చెందిన రిపోర్టర్ ఓ కథనాన్ని ప్రసారం చేస్తాడు. దాంతో అవకాశాలు సన్నగిల్లడంతో రౌడీ షీటర్ మైసమ్మ (జగపతిబాబు)తో రిపోర్టర్ షఫీని చంపించేందుకు పోలీస్ ఆఫీసర్ (ఆహుతిప్రసాద్)తో కలిసి గంగాప్రసాద్ ప్లాన్ వేస్తాడు.
ఇదిలా ఉండగా, పాలకొల్లు నుంచి చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చిన శ్రీను(సాయిధరమ్ తేజ్) మైసమ్మ వద్దకు వచ్చి తనను చంపాలని కోరుతాడు. ఎందుకు చంపాలని మైసమ్మ అడగడంతో శైలజ(రెజీనా)తో ప్రేమ కథను చెప్పడం ప్రారంభిస్తాడు.. కథ అలా సాగుతుండగానే శ్రీను, శైలజలను చంపాలని మైసమ్మను పోలీస్ ఆఫీసర్ ఆదేశిస్తాడు. శ్రీను, శైలజలను చంపాలని ఎవరు, ఎందుకు అనుకున్నారు? మైసమ్మ ఏం చేశాడు? గంగప్రసాద్, ప్రభాకర్‌లిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యాడు? అనే ప్రశ్నలకు వినోదత్మాకంగా, బోలెడన్ని ట్విస్టులతో ఆసక్తికరంగా అందించిన సమాధానమే ’పిల్లా నువ్వు లేని జీవితం’
‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైనప్పటికి.. సాయిధరమ్‌కు తొలి చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. తొలి చిత్రమైనా మంచి ఎనర్జీ, యాక్షన్, టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ మేనరిజం, పవన్ కళ్యాణ్ స్టైల్‌ను క లిపి.. కొత్త ఇమేజ్‌ను సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. తొలి చిత్రం ద్వారా దొరికిన చక్కటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. శైలజ పాత్రలో గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌తో రెజీనా మరోసారి తెలుగు తెరపై మెరిసింది. ఈ చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడానికి మరో మెట్టు ఎక్కింది.
ఈ చిత్రంలో మైసమ్మ పాత్రలో జగపతిబాబు మరోసారి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. లెజెండ్ చిత్రం ద్వారా ప్రత్యేకపాత్రతో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన జగపతిబాబు మైసమ్మగా గుర్తుండి పోయే పాత్రను పోషించారు.
రఘుబాబు, తాగుబోతు రమేశ్‌లు తమ ప్రాతలతో ఈ చిత్రానికి అదన పు ఆకర్షణగా మారారు. చంద్రమోహన్, జయప్రకాశ్‌రెడ్డి, హేమ తదితరులు కనిపించింది కాసేపే అయినా.. హస్యంతో కడుపుబ్బ నవ్వించారు.
సాంకేతిక అంశాలు:
ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ప్రేమ కథ అంశాలకు తగిన సంగీతాన్ని అందించడంలో అనూప్ రూబెన్ తన మార్కును చూపించారు. చిన్నా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరింత బలాన్ని అందించింది.
యాక్షన్, రొమాంటిక్ సీన్లు, ట్రైన్ ఎపిసోడ్ లాంటి సన్నివేశాలు శివేంద్ర కెమెరా పనితనానికి అద్దం పట్టాయి. ఊహకందని ట్విస్టుల ద్వారా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో దర్శకుడు రవికుమార్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథే అయినా కొత్తరకం స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో క్లైమాక్స్ వరకు దూసుకొచ్చిన ఈ చిత్రం.. చివరి పదిహేను నిమిషాల్లో మందగించిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయినా చిత్ర కథనం మాత్రం ఆసక్తికరంగానే సాగింది. కొన్ని ప్రతికూల అంశాలున్నా.. వాటిని సానుకూల అంశాలు డామినేట్ చేశాయి. దాంతో సాయిధరమ్ తేజ్, రవికుమార్ చౌదరి ఖాతాలో భారీ విజయం నమోదయ్యే అవకాశం ఉంది.
-రాజబాబు అనుముల