మల్టీ టాలెంటెడ్ | Multi-Talented child actors | Sakshi
Sakshi News home page

మల్టీ టాలెంటెడ్

Published Sun, Nov 13 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

Multi-Talented child actors

మల్టీ టాలెంటెడ్     
పేరు: అవంతిక వందనపు,
ఊరు: హైదరాబాద్
వయసు: 11 ఏళ్లు
సినిమా: ‘బహ్మోత్సవం’, ‘ప్రేమమ్’ ఫేం
‘చదువుకోవలసిన పసి పిల్లలను పనివాళ్లుగా మార్చకండి. బడికి వెళ్లాల్సిన వయసులో బాల కార్మికులను చేయకండి’ అనే ఇతివృత్తంతో రూపొందిన షార్ట్ ఫిల్మ్ ‘ప్రజా హక్కు’లో అవంతిక వందనపు ప్రధాన పాత్రలో నటించింది. బాలికల విద్య, హక్కులు, కూచిపూడి నాట్య ప్రాముఖ్యతను చర్చించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అవంతిక అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ చేయక ముందు అవంతిక సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’, నాగచైతన్య ‘ప్రేమమ్’ తదితర చిత్రాల్లో నటించిన ఈ క్యూట్ గాళ్ పలు కమర్షియల్ యాడ్స్ చేసింది. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’, అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోన్న మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి పుట్టింది అమెరికాలో. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ షిఫ్టయ్యారు. మంచి యాక్టర్ మాత్రమే కాదు, డ్యాన్సర్ కూడా. ఐదేళ్ల వయసులో డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా గీస్తుంది. మల్టీ టాలెంటెడ్. ఫేస్‌బుక్‌లో ఆమెకు 50 వేల మంది అభిమానులున్నారు.
 
అమ్మకన్నా ముందే...
పేరు: నైనిక,
ఊరు: చెన్నై
వయసు: 5 ఏళ్లు,
సినిమా: ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’గా విడుదలైంది)
‘నటన మా రక్తంలోనే ఉంది’ - స్టార్ హీరోల వారసులు హీరోలుగా నటించిన సినిమాల్లో అప్పుడప్పుడూ ఇలాంటిడైలాగులు వినిపిస్తా యి. తమిళ హీరో విజయ్ ‘తెరి’లో బేబీ నైనిక నటన చూసిన తర్వాత.. ‘ఈ అమ్మాయి రక్తంలోనే నటన ఉంది’ అనడం అతి శయోక్తి కాదు. ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా కూతురు. ‘పోలీస్’లో నటించినప్పుడు నైనిక వయసు నాలుగేళ్లు. హీరో విజయ్ కూతురు నివి పాత్రలో ముద్దు ముద్దుగా నటించి, మెప్పించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మీనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ సినిమా ద్వారానే పరిచయ మయ్యారు. అప్పుడామె వయసు ఆరేళ్లు. బేబీ నైనిక అమ్మ కంటే రెండేళ్ల ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా సుమారు 45 సినిమాలు చేశారు. కానీ, కూతురు విషయంలో తొందర పడడం లేదు. నైనిక చదువుకి ఆటంకం కలగకుండా మంచి సినిమాలు వచ్చినప్పుడు ఓకే చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారట.
 
కళ్లతోనే కనికట్టు!
పేరు: హర్షాలీ మల్హోత్రా,
ఊరు: ముంబై
వయసు: 8 ఏళ్లు,
సినిమా: ‘భజరంగీ భాయిజాన్’
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. కళ్లతోనే నటించాలి. సంతోషం, బాధ, ఆక్రోశం.. ఏ భావమైనా కళ్లతోనే పలికించాలి! మన ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన హిందీ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’లో మూగ అమ్మాయి షాహిదాగా హర్షాలీ మల్హోత్రా చేసిన క్యారెక్టర్ ఇది. ఆరేళ్ల చిన్నారికి ఇది బరువైన పాత్ర! అందుకే, దర్శక-రచయితలు ఐదువేల మంది చిన్నారులను ఆడిషన్ చేసి, హర్షాలీను ఎంపిక చేశారు. ‘భజరంగీ భాయిజాన్’ విడుదల తర్వాత హర్షాలీ నటనను ప్రశంసించడానికి ఎవ్వరి దగ్గరా మాటల్లేవ్. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులూ అంతే. అంత అద్భుతంగా నటించింది మరి. ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులూ ఫిదా అయ్యారు. వెండితెరపై హర్షాలీ నటించిన తొలి చిత్రమిది. అంతకు ముందు మూడేళ్ల వయసులోనే రెండు సీరియళ్లలో నటించింది. ట్విట్టర్‌లో 15వేల మంది హర్షాలీను ఫాలో అవుతున్నారు.
 
భాష తెలియకపోయినా...
పేరు: మిఖాయిల్ గాంధీ,
ఊరు: ముంబై
వయసు: 6 ఏళ్లు,
సినిమా: ‘సుప్రీమ్’
దర్శకుడు కట్ చెప్పగానే నటీనటులు క్యారెక్టర్ నుంచి డిస్‌కనెక్ట్ కావడం సహజమే. అందులోనూ ఏడుపు సన్నివేశాలైతే ఎక్కువ శాతం నటీనటులు గ్లిజరిన్ వాడుతుంటారు. బహుశా.. అతి తక్కువ మంది గ్లిజరిన్ సహాయం లేకుండా ఏడుస్తారు. అందులో మిఖాయిల్ గాంధీ ఒకడు. సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’లో రాజన్ పాత్రలో ఈ బుడ్డోడి నటన సూపర్ అన్నారంతా. షూటింగ్‌లో జాయిన్ అయిన ఫస్ట్‌డే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సీన్ ప్లాన్ చేశారు. సెట్‌లో మిఖాయిల్ అల్లరి చూసి ‘ఏం నటిస్తాడులే!’ అనుకున్న రాజేంద్రప్రసాద్, యాక్షన్ చెప్పగానే గాంధీ డైలాగ్ చెప్పిన తీరు చూసి ‘ఓరీడి దుంపతెగ’ అనకుండా ఉండలేకపోయానన్నారు. ‘‘ఎమోషనల్ సీన్‌లో దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా గాంధీ ఏడుస్తున్నాడు. తను హిందీ అబ్బాయి కదా, తెలుగు రాదు. చిన్న వయసులో పాత్రను అర్థం చేసుకుని, లీనమై నటించడం చిన్న  విషయం కాదు’’ అని సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement