బదరీనాథ్‌కి దుల్హనియా | Multiplex Movie Badrinath Ki Dulhania | Sakshi
Sakshi News home page

బదరీనాథ్‌కి దుల్హనియా

Published Sat, Dec 9 2017 12:20 AM | Last Updated on Sat, Dec 9 2017 1:43 AM

Multiplex  Movie Badrinath Ki Dulhania  - Sakshi

2017..మల్టిప్లెక్స్‌ సినిమాల పరంగా మంచి హిట్స్‌నే సాధించింది.  లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా,మామ్, హిందీ మీడియం, సీక్రెట్‌ సూపర్‌స్టార్,టాయ్‌లెట్, న్యూటన్, ఖరీబ్‌ ఖరీబ్‌ సింగిల్‌ వంటి సెన్సిబుల్‌ మూవీస్‌నూ చూపించింది. పాపులర్‌ జానర్‌లో ఉమన్‌ ఓరియెంటెడ్‌ ‘బదరీనాథ్‌ కి దుల్హనియా’లాంటి సినిమానూ ప్రదర్శించింది. ఈ వారం దీని కథ చెప్పుకుందాం.రెండు ఊళ్లు.. కోటా, ఝాన్సీ! ఐఐటీకి నమూనాలను పోతపోసే ఫ్యాక్టరీగా పేరున్న కోటా హీరోయిన్‌ వైదేహీ (అలియా భట్‌) పుట్టిల్లు.   రాణి లక్ష్మీబాయి వీరోచిత పోరాటానికి పురిటి గడ్డయినా... ఇప్పుడు పురుషుడి ఆధిపత్యం కిందే నలుగుతున్న ఝాన్సీ.. హీరో బదరీనాథ్‌(వరుణ్‌ ధావన్‌) పుట్టిల్లు.  రెండిళ్లలో  కుటుంబ పెద్దలు పిల్లలను ఆక్సిజన్‌ సిలిండర్‌తో ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు.  ఉనికి కాపాడాల్సిన ఆక్సిజన్‌ ఈ రెండిళ్లలో పిల్లల హక్కుల ఊపిరి ఆపడానికి పనిచేస్తుంటుంది. బదరీనాథ్‌ (వరుణ్‌ ధావన్‌)ఇంటర్‌ ఫెయిల్‌ స్టూడెంట్‌. వడ్డీ వ్యాపారి అయిన తండ్రికి అప్పులు, వడ్డీ వసూలు చేసే అసిస్టెంట్‌. హీరోయిన్‌ వైదేహీ (అలియా భట్‌) స్వతంత్య్ర వ్యక్తిత్వంతో నిలబడాలనుకునే మోడర్న్‌ గర్ల్‌. వరకట్నాన్ని, పురుషహంకారాన్ని ద్వేషించే స్త్రీవాది. ఆర్థికంగా తాను నిలబడుతూ కుటుంబానికి అండగా ఉండాలనుకునే అమ్మాయి. ఓ వైపు చదువుకుంటూనే బ్యూటీ సెలూన్‌ ఒకటి ప్రారంభించాలనుకుంటుంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బ్యూటీసెలూన్‌ కోసం ప్లాన్‌ చేస్తుంది. పెట్టుబడి కోసం తండ్రిని డబ్బు   అడుగుతుంది.

ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్‌..
 ప్రభుత్వోద్యోగి అయిన ఆ తండ్రి ఆడపిల్లల చదువు, ఉద్యోగం విషయాల్లో తమ కమ్యూనిటీలోని మిగతావాళ్లకన్నా కొంచెం ముందుంటాడు. అందుకే  చిన్న కూతురు వైదేహీ వ్యాపారం కోసం డబ్బు అడగానే తన ప్రావిడెంట్‌ ఫండ్‌ తీసి ఇచ్చేస్తాడు. వైదేహీ ఆశలు, ఆశయాలను బలహీనతగా తీసుకున్న బాయ్‌ ఫ్రెండ్‌ ఆ డబ్బుతో ఉడాయిస్తాడు. తండ్రికి హార్ట్‌ఎటాక్‌ వస్తుంది. వైదేహీ తన హక్కు  గురించి ఆ ఇంట్లో గళమెత్తినప్పుడల్లా ఆమె మోసపోయి ఆ ఇంటికి చేసిన నష్టం గురించి ప్రస్తావించి ఆ గొంతును అదుపులో ఉంచేందుకు ఆక్సిజన్‌ సిలెండర్‌ సహాయం తీసుకుంటుంటాడు తండ్రి. ఇలాంటి స్టోరీ బదరీనాథ్‌ ఇంట్లోనూ ఉంది. ఆయన దృష్టిలో మగ పుట్టుకే పుట్టుక. కట్నం కోసమే పెంచుతాడు వాళ్లను. ఏంబీఏ గ్రాడ్యూయేట్‌ అయిన పెద్దకొడుకు (బదరీనాథ్‌ అన్నయ్య) ప్రేమను కులం, జాతి, అంతస్థు, కట్నం పేరుతో పాతరేస్తాడు. ఆ ఇంట్లో మగపిల్లలు ప్రేమకాటుకు గురికాకుండా ఈ తండ్రీ ఆక్సిజన్‌ సిలిండర్‌ను చూపిస్తూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటాడు.

మౌనపోరాటం..
తను చూసిన అమ్మాయి(శ్వేతాబసు ప్రసాద్‌)నే  ఆ ఇంటి పెద్ద కోడలుగా చేస్తాడు. ఆమే ఎంబీఏ గ్రాడ్యూయేటే. చదువుకున్న అమ్మాయిలంటే బదరీనాథ్‌ తండ్రికున్న చిన్నచూపు కారణంగా ఆ అమ్మాయి చదువును దాచేస్తారు.  మామకు తప్ప ఆ ఇంట్లో ఎవరికీ మెదడు, నోరు ఉండదని, ఉండకూడదనే ఆ ఇంటి లాను అర్థం చేసుకుంటుంది ఆమె కొత్తకోడలిగా ఆ కుటుంబంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే. అందుకే తాను చేయాలనుకున్న పనిని భర్తతో చేయిస్తుంది. వంట, ఇల్లు తప్ప ఇంకో లోకం తెలియని అమాయక ఇల్లాలుగా నటిస్తూ  పడకగదినే తన సామ్రాజ్యంగా మలచుకుంటుంది. ఆమె ఆలోచనలు, వ్యూహాలకు ఆక్కడే కార్యాచరణ రచిస్తుంది.  భర్తకు బిజినెస్‌మేనేజ్‌మెంట్‌ టీచర్‌గా మారి బిజినెస్‌ పాఠాలూ చెప్తుంది.  భర్త మాటగా మామకు చెప్పించి ఓ షోరూమ్‌ను తెరిపిస్తుంది. మధ్యాహ్నం భర్తకు లంచ్‌ తీసుకెళ్లే పేరుతో బిజినెస్‌ వ్యవహారాలను చక్కబెడుతుంది. హక్కుల కోసం పోరాటం చేయలేనిస్థితిలో లౌక్యమనే ఆయుధంతో ప్రతికూల పరిస్థితుల్లో సైతం అస్తిత్వాన్ని చాటుకోవడమెలాగో చెప్తుంది శ్వేతాబసు పాత్ర.

ప్రేమ పాచిక
 హీరోయిన్‌ దగ్గరకు వస్తే ఒక పెళ్లిలో హీరోయిన్‌ చూసి మనసు పారేసుకుంటాడు బదరీనాథ్‌. అమెకున్న స్థిరమైన అభిప్రాయాలు విని ఖంగుతింటాడు. అయినా వెంటపడతాడు. తన పట్ల బదరీనా«థ్‌కున్న  ప్రేమను కట్నం లేకుండా అక్క పెళ్లిచేయడానికి ఉపయోగించుకోవాలను కుంటుంది. ఆ పని చేస్తే  పెళ్లిచేసుకుంటాననే బాధ్యతను మోపుతుంది బదరీనాథ్‌ మీద. బిజినెస్‌ ప్లాన్‌ ఫెయిల్యూర్‌ తర్వాత ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటుంది. బదరీనాథ్‌తో  సన్నిహితంగా ఉన్నా ఆమె ఆలోచన మాత్రం తన గోల్‌ చుట్టే తిరుగుతుంటుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ అక్కకు సంబంధం చూసి కానీ కట్నం లేకుండా ఖాయం చేయిస్తాడు. పనిలోపనిగా వైదేహీతో తన పెళ్లికీ తండ్రిని ఒప్పిస్తాడు. ఒకే మంటపంలో ఇద్దరి పెళ్లి. ముహూర్తానికి వైదేహీ అక్క వస్తుంది పందింట్లోకి.. ఇంకోవైపు పూలదండ పట్టుకొని వెయిట్‌ చేస్తుంటాడు బదరీనాథ్‌ తన పెళ్లికూతురు కోసం.. ఆమె పారిపోతుంది. తన కలలకు రెక్కలు తొడిగి ముంబై రైలెక్కుతుంది ధ్యేయాన్ని నెరవేర్చకోవడానికి. ఆ తర్వాత అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లిపోతుంది.

కామన్‌ క్లైమాక్స్‌
ఆ అవమానాన్ని తట్టుకోలేని  çవరుడి పురుషాహంకార  తండ్రి అతనిని కొడుకి అహాన్ని  రెచ్చగొడుతుంటాడు. ‘‘ ఆ పిల్ల ఎక్కడున్నా జుట్టుపట్టుకు ఈడ్చుకురా.. ఈ ఊళ్లో నడిబొడ్డున ఉరేద్దాం’’ అంటాడు. స్కైప్‌ ద్వారా తెలుస్తుంది వైదేహి సింగపూర్‌లో ఉందని. స్నేహితుడితో వెళ్లడం.. ఆమెను వెదుకుతాడు. పట్టుకొని ఇండియాకు తెచ్చే ప్రయత్నంలో  అక్కడ వైదేహీ సాధించిన విజయం, ఆమె ప్రవర్తన బదరీలో మార్పు తెస్తుంది. ఇద్దరూ ఝాన్సీకి వచ్చి బదరీనాథ్‌ తండ్రికి కనువిప్పు కలిగిస్తారు. ఇదంతా ఫక్తు  కమర్షియల్‌ సినిమాటిక్‌  క్లైమాక్సే.  చివరకు ఝాన్సీలో ఎయిర్‌ హోస్టెస్‌కావాలనుకునే అమ్మాయిలకు ఓ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి స్థిరపడుతుంది వైదేహీ. మహిళా అస్విత్వాన్ని మొదటినుంచీ పదునైన పాయింటింగ్‌ సినిమాను నడిపించిన దర్శకుడు పెళ్లి తర్వాత హీరోయిన్‌ ఉద్యోగం చేయడాన్ని ఇన్‌స్టిట్యూట్‌తో  కాంప్రమైజ్‌ చేయించేస్తాడు.  ఆడపిల్ల జన్మనే సహించని బదరీనాథ్‌ తండ్రి బదరీకి ఆడపిల్ల పుట్టడం చూపించి ఆ పెద్దమనిషిలో మార్పు మొదలైందనే సినిమా సందేశాన్నీ ఇచ్చి కామన్‌ ఎండ్‌ను నిర్దేశించాడు  శశాంక్‌ ఖేతాన్‌.

ఈ సినిమాకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి.  ఇదేమీ ఆర్ట్‌ మూవీ కాదు. రెగ్యులర్‌ మూవీనే. అయితే ఎక్స్‌పోజింగ్‌ బాడీతో డాన్సింగ్‌ డాల్‌గానే తప్ప హీరోయిన్‌ బ్రెయిన్‌ చూపించని కామన్‌ మూవీస్‌ ప్యాటర్న్‌లోనే  హీరోయిన్‌ ఓరియేంటేషన్‌తో వచ్చిన సినిమాగా  మాత్రం దీన్ని గుర్తించాలి. ప్రాఫిట్స్‌ కోసమే రీల్‌చుట్టుకున్న ఈ చిత్రం లింగవివక్ష అనే సామాజిక  అంశాన్నయితే చర్చకు పెట్టింది. కమర్షియల్‌ సినిమాలూ సోషల్‌ ఇష్యూస్‌ మీద బ్రహ్మాండంగా ఫోకస్‌ చేయొచ్చని నిరూపించింది బాక్సాఫీస్‌ హిట్‌ కూడా కొట్టి.  అలియా, వరుణ్‌ధావన్‌ల కెమిస్ట్రీ యాజ్‌ యూజ్‌వల్‌గా సూపర్బ్‌.  మీడియా నెగటివ్‌ ఫోకస్‌ తర్వాత శ్వేతాబసు సెల్యులాయిడ్‌ మీద కనిపించిన మొదటి సినిమా ఇది.  ఆమె ప్రతిభ ఇందులో ఆత్మవిశ్వాసంగా కనపడుతుంది. ఆసక్తి ఉన్న వాళ్లు బదరీనాథ్‌ దుల్హనియాను  అమేజాన్‌ ప్రైమ్‌లో చూడొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement