
సినిమా: సినీ తారలవి ఆడంబర జీవితాలే. ముఖ్యంగా హీరోయిన్లు క్రేజీనే. వారిని అభిమానించేవారు చాలా మందే ఉంటారు. సగటు మనిషికి వారొక అద్భుతం. కలలరాణులు. అయినా వారూ మనుషులే కదా! పీత కష్టాలు పీతవి అన్న సామెతలా హీరోయిన్లు ఒక్కోసారి అవమానాలను, మనోవేదనలను ఎదుర్కొంటుంటారు. అయితే కొందరు చెప్పుకుంటారు, మరి కొందరు పరువు ప్రతిష్టలకు భంగం అని మనసులోనే దిగమింగుకుంటారు. నటి కాజల్‌అగర్వాల్ అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొందట. ఈ బ్యూటీ భారతీయ చిత్ర పరిశ్రమలో పేరున్న నటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. బహుభాషా నటి కావడంతో విమానాల్లో ఎక్కువ ప్రయాణం చేయడం తప్పనిసరి. అలా ప్రయాణిస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో ఈ అమ్మడికి ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైందట.
ఈ సంఘటన గురించి కాజల్‌అగర్వాల్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ఇటీవల ముంబై విమానాశ్రయానికి ఉదయం వెళ్లానని చెప్పింది. అప్పుడు అక్కడి నిర్వాహకం ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లగా ఆ కౌంటర్‌లో ఉన్న ఒక మహిళ తనను అనవసరంగా విసిగించిందని చెప్పింది. తాను విమానం బయలుదేరడానికి 75 నిమిషాల ముందే విమానాశ్రయానికి వెళ్లినా అనవసర ప్రశ్నలతో అవమానపరిచే విధంగా ప్రవర్తించి, ఆ తరువాత వెళ్లమని చెప్పిందని తెలిపింది. అయితే గంట సమయం ఉన్నా విమానంలోకి వెళ్లే దారిని మూసివేశారని చెప్పింది. విమానంలోకి వెళ్లడానికి అరగంట సమయం పట్టేంత దూరంలో తనను నిలిపేశారని అంది. ఇలా పలు అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపింది. దీని గురించి విమాన సంస్థ నిర్వాహకులకు ఫిర్యాదు చేయబోగా అక్కడి అధికారులు ఏకాంతంగా మాట్లాడడానికి రమ్మన్నారని, వారితో మాట్లాడడం తనకు ఇష్టం లేక వారికి సమయాన్ని కేటాయించలేదని కాజల్‌అగర్వాల్ పేర్కొంది.