కొనసాగుతున్నఫొటోల నిషేధం
తెలుగులో హిట్టయిన ‘కిక్’ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేకై, శుక్రవారం విడుదలై, పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. అయితే, ఈ చిత్ర ప్రచారం సందర్భంగా పది రోజుల క్రితం ఫొటోగ్రాఫర్లతో, సల్లూ భాయ్‌కి రేగిన వివాదం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. సాజిద్ నడియాడ్‌వాలా దర్శకత్వంలో తయారైన ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేసినప్పుడు ఫొటోగ్రాఫర్లు కూడా హాజరయ్యారు కానీ, సల్మాన్‌ను ఫొటో తీయలేదు. సినీ కార్యక్రమాల్లో సల్మాన్ ఫొటోలు తీయకూడదంటూ, తమకు తాముగా విధించుకున్న నిషేధానికి ముంబయ్ ఫొటోగ్రాఫర్లు కట్టుబడి ఉన్నారు. ఈ నిషేధం ఫలితంగా ‘కిక్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ ఫొటోలు రావడం లేదు.
సల్మాన్ దురుసు ప్రవర్తనకు నిరసనగా, ఆయనను బాయ్‌కాట్ చేయాలని ముంబయ్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్ణయించుకున్నప్పటికీ, సినిమా ప్రమోషన్‌కు మాత్రం సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మాట మీదే నిలబడింది. అయితే, సల్లూ భాయ్ మాత్రం ఫొటోగ్రాఫర్ల నిషేధాన్ని తేలికగా తీసుకొని, ‘వాళ్ళ వల్ల నేనేమీ స్టార్‌ను కాలేద’న్న మాటకే కట్టుబడ్డారు.
వెరసి, ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్క్రీన్‌ప్లే రచనలో పాలుపంచుకొన్న ప్రముఖ రచయిత చేతన్ భగత్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారి ఫోటోలు తీయడంలో ఫొటోగ్రాఫర్లు మునిగిపోయారు. ‘కిక్’ వాణిజ్య ఫలితం ఎలా ఉన్నా, మీడియాతో ఈ వివాదానికి సల్లూ భాయ్ ఫుల్‌స్టాప్ పెడితేనే, ఇరు పక్షాలకు మేలని వేరే చెప్పాలా?