
నేడు ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తండ్రులతో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు వరల్డ్ మ్యూజిక్ డే కావడంతో పలువురు సంగీత దర్శకులు కూడా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కొందరు అభిమానులు చేసిన ట్వీట్‌లపై స్పందించారు. తన గురువు మణిశర్మపై తన అభిమానాన్ని మరోసారి వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. తమన్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ మణిశర్మపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో మణిశర్మతో కలిసి వేదిక పంచుకున్న తమన్ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యారు. తమన్ మాట్లాడుతూ.. ‘ఆయన ముందు ఉంటే మాటలు రావడం లేదు. దేశంలో ఆయన పనిచేయని మ్యూజిక్ డైరెక్టరే లేరు. అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఫేవరేట్ కీ బోర్డ్ ప్లేయర్ ఆయన. ఆయన సంగీత దర్శకుడిగా మారి యువ తరాలకు చాలెంజ్స్ ఇచ్చారు. ఎవర్‌గ్రీన్ మెలోడిలు అందజేశారు. ప్రపంచంలో నా పని మీద నమ్మకం ఉంది మా నాన్న గారికి. వీడు కచ్చితంగా మంచి డ్రమ్మర్ అవుతాడని. మీకు తెలుసు నేను చిన్నతనంలోనే మా నాన్నను కోల్పోయాను. నాన్న లేని లోటు తీర్చింది మణి గారు. తొమ్మిదేళ్లు నేను ఆయనతో వర్క్ చేశాను.. అప్పుడు ఆయన ఇచ్చిన అనుభవమే ఇప్పుడు నా వృత్తి. ఆయన లేకుండా నేను లేను. ఆయన పేరు నిలబెట్టడం నా బాధ్యత. నా హార్డ్ వర్క్‌ను ఆయనకు అంకితం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేశారు. దీనిపై తమన్ స్పందిస్తూ.. ‘ఇది నిజం.. ఆయన లేకుండా నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు’ అని పేర్కొన్నారు. అలాగే ఆ ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేశారు.
It’s true ♥️🤍
— thaman S (@MusicThaman) June 21, 2020
Without him i am not here today ♥️🔈🎹💿 https://t.co/AfILdeJQ2H