నాన్నగారు ఆ రాత్రి అందర్నీ పిలిపించుకున్నారు!
నాన్నగారు ఆ రాత్రి అందర్నీ పిలిపించుకున్నారు!
Published Wed, Jan 29 2014 11:35 PM | Last Updated on Thu, May 24 2018 12:20 PM
మహానటుడు ఏయన్నార్ దివికేగి అప్పుడే వారం రోజులైపోయింది. కుటుంబ సభ్యులూ అభిమానులూ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నాగార్జున కూడా తండ్రి లేని లోటుని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ‘నాకాయన తండ్రికన్నా ఎక్కువ’’ అంటూ ఏయన్నార్ చివరి రోజుల్ని, అప్పటి సంఘటల్ని నాగ్ ‘ఫేస్‌బుక్’లో ఇలా ఆవిష్కరించారు.
* ‘మనం’ షూటింగ్ లొకేషన్‌లోనే ఉన్నప్పుడే నాన్నగారు అస్వస్థతకు గురయ్యారు. అన్ని పరిక్షలు చేసిన తర్వాత కేన్సర్ ఐదో దశలో ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పటివరకు నాన్నగారు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు కేన్సర్ అని తెలియగానే, మాకు ధైర్యం చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం పదిహేను రోజులకు ఆస్పత్రినుంచి నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చాం. అప్పుడాయన, ‘నా ఆరోగ్యం ఇంకా పాడవ్వకముందే ‘మనం’లో నా పాత్రకు డబ్బింగ్ చెబుతా. డబ్బింగ్ పరికరాలన్నీ ఇంటికి తెప్పించు.
ఒకవేళ నేను చెప్పకపోతే ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్‌తో నా పాత్రకు డబ్బింగ్ చెప్పించేస్తావు’ అన్నారు. ఆయన అనుకున్నట్లుగానే డబ్బింగ్ చెప్పారు. ఒక్క పాట మినహా తన పాత్రకు సంబంధించిన మిగతా షూటింగ్‌ని పూర్తి చేశారు. 1920 నుంచి 2013 మధ్యలో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. అందులో నాన్నగారు 90 ఏళ్ల వ్యక్తి పాత్ర చేశారు. మార్చి, 31న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఆయనకు ఓ ఘనమైన వీడ్కోలుగా ఈ సినిమా ఉంటుందని నా ఆకాంక్ష.
* ఇంత త్వరగా ఇలా జరుగుతుందని నాన్నగారు ముందే ఊహించారనుకుంటున్నాను. మాక్కూడా తెలియజెప్పాలనుకుని ఉంటారు. ఎందుకంటే, సెప్టెంబర్‌లో తన 90వ పుట్టినరోజుని దేశ, విదేశాల్లోని తన మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలనుకున్నారు. అందర్నీ ఆహ్వానించారు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు. దాదాపు రెండు వేల మంది ఆ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. అతిథుల కోసం సుమారు 200 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గరికెళ్లి, అందరితోనూ మాట్లాడారు. ఆ సందర్భంగా గంటసేపు తన లైఫ్ ట్రావెలింగ్ గురించి మాట్లాడారు. లక్కీగా మేం ఆ స్పీచ్‌ని రికార్డ్ చేశాం. దీన్ని అందరి ముందుకూ తీసుకురావాలనుకుంటున్నాం.
* చివరి దశలో నాన్నగారు అన్ని సినిమాలూ చూడటం మొదలుపెట్టారు. ఆయా సినిమాల్లోని ఆర్టిస్టుల యాక్టింగ్ గురించి మాత్రమే ఆయన మాట్లాడేవారు. ‘శ్రీరామదాసులో నా నటన ఆయనకిష్టం. ఏ చివరి రోజుల్లో ఆయనకు నొప్పి అనిపించేది. ఆస్పత్రికి తీసుకెళితే, మొదటిసారి ‘పెయిన్ కిల్లర్స్’ ఇచ్చారు. మరో రెండు నెలలు మాత్రమే అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నాన్నగారు ‘ఇంటికెళదాం’ అన్నారు. ఆ రాత్రి (జనవరి, 21) మమ్మల్నందర్నీ ఆయన దగ్గర ఉండమన్నారు. తొమ్మిదిన్నరకు అందర్నీ ఇంటికెళ్లమన్నారు.
కేన్సర్‌ని ఎదుర్కొలేం అని తెలుసుకున్న తర్వాత ఆ రాత్రే ఆయన ప్రశాంతంగా కనుమూశారు. నాన్నగారి మరణవార్త తెలుసుకుని, అభిమానులు, ఇతరులు స్పందించిన తీరుకి మేమంతా విస్తుపోయాం. బాధపడటానికి కూడా మాకు టైమ్ దొరకలేదు. వేలాది మంది తరలి వచ్చారు. అంతమందికి ప్లేస్ లేకపోవడంతో మేం ఇంటి గేటు మూసేశాం.
* తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అందరి సందర్శనార్థం నాన్నగారి భౌతికకాయాన్ని ఉంచాం.
* నాన్నగారి చివరి రోజుల్లో ఆయనతో ఎక్కువ గడపడం కోసం షూటింగ్స్ అన్నీ వదులుకున్నాను. నా పనులన్నీ మానుకున్నాను. ఇప్పుడు ఆయన లేరు. ఇప్పటికీ పని మీద మనసు నిమగ్నమవ్వడంలేదు. పరధ్యానంగానే పని చేస్తున్నాను.
Advertisement