నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!
నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు!
Published Sun, Oct 20 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
విలనీ, కామెడీ... ఏదైనా జయప్రకాశ్‌రెడ్డికి సునాయాసమే. పైకి విలన్‌గా కనిపిస్తారు కానీ, చేసే పనులూ సేవాకార్యక్రమాలూ చూస్తే ఎవరైనా సరే జేపీని ఓ హీరోగా చూస్తారు. పాతికమంది పిల్లలకు విద్యాదానం చేస్తున్నారాయన. నటుడిగా తనకు ఓ దారి చూపించిన రంగస్థల వైభవాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ కమర్షియల్ యుగంలో కూడా నిజాయితీ, ఆత్మసంతృప్తి అని మాట్లాడే జేపీతో జరిపిన ప్రత్యేక భేటీ.
మీ ఆహార్యం విలన్ పాత్రలకు యాప్ట్ అయినా కామెడీ కూడా చేస్తున్నారు. ఈ రెంటిలో మీకేది ఇష్టం?
మొదట్నుంచీ హాస్యం అంటేనే ఇష్టం. అయితే సినిమాల్లో సీరియస్ కేరక్టర్స్‌కే బాగా పేరొచ్చింది. వరుసగా అలాంటి అవకాశాలే వచ్చాయి. తర్వాత తర్వాత నాలో కామెడీ టింజ్ చూసి, దర్శకులు ఆ తరహా పాత్రలు చేయిస్తున్నారు. అంతకు ముందు ఆడవాళ్లు, చిన్నపిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడేవాళ్లు. కానీ, ఇప్పుడందరూ వచ్చి మాట్లాడుతున్నారు.
మీ డ్రీమ్ కేరెక్టర్?
అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంటుంది. నా నటనలో ఎప్పుడూ మూస కనపడదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, గోదావరి, నెల్లూరు... ఇలా ఏ శ్లాంగ్‌లోనైనా మాట్లాడగలనని నిరూపించుకున్నాను. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకులు ఎలా కావాలంటే అలా చేస్తాను. ఇక, నా డ్రీమ్ రోల్ విషయానికొస్తే... ప్రేక్షకులతో కంట తడిపెట్టించి, హృదయానికి హత్తుకునే పాత్ర ఎప్పటికైనా చేయాలని ఉంది.
అసలు ఏ ఆశయంతో నటుడయ్యారు.. దాన్ని నెరవేర్చుకోగలిగారా?
ఆశయం అంటూ ఏదీ లేదు. మా నాన్నగారు మంచి రంగస్థల నటుడు. కానీ, పోలీస్ ఉద్యోగం వల్ల నటించలేకపోయారు. అందుకే నాన్నగారు నన్ను రంగస్థల నటుణ్ణి చేయాలనుకున్నారు. నాకూ అదే ఇష్టం. అందుకని కళాకారుడినయ్యాను. అట్నుంచి సినిమాల్లోకొచ్చా.
నటుడిగా బిజీ అయ్యాక కూడా నాటకాలు ప్రదర్శిస్తున్నారు కదా?
ఆంధ్రదేశంలో ప్రతి ముఖ్య పట్టణంలో ప్రతి ఆదివారం ఒక నాటక ప్రదర్శన జరగాలనేది నా కల. ఎందుకంటే మంచి నటీనటులు ఉన్నారు. నాటకాలను ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఉన్నారు. దాతలు కూడా ఉన్నారు. కానీ, వీటిని కో-ఆర్డినేట్ చేసేవాళ్లు లేరు. నా వంతు ప్రయత్నంగా నేను గుంటూరులో ‘జేపీ నెల నెలా నాటక సంఘం’ పేరుతో ఓ సంస్థ ప్రారంభించాను. ప్రతినెలా రెండో ఆదివారం ఓ చక్కని నాటకం చూపించాలన్నది నా ఆశయం.
సినిమాల వల్ల ఆర్థికంగా మీకు లాభం ఉంటుంది.. మరి నాటకాల సంగతేంటి?
సినిమాలు చేస్తే నా జేబులోకి డబ్బులొస్తాయి. కానీ నాటకాలు చేస్తే జేబులోంచి డబ్బులు పోతాయి. అయితే, నాటకాలనేది డబ్బు కోసం కాదు. సంతృప్తి కోసం. డబ్బులు కోసం చేసే సినిమాల ద్వారా కూడా నాకు ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఓ పది, పదిహేనేళ్లు సినిమా రంగంలో నానా కష్టాలు పడిన తర్వాత ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో నాకో సీటు లభించింది. ‘సమరసింహారెడ్డి’తో బెర్త్ కూడా కన్‌ఫార్మ్ అయ్యింది. అక్కణ్నుంచీ చాలా అవకాశాలు వస్తున్నాయి. ఓ నటుడిగా అవకాశాలు రావడమే గొప్ప. అందుకే, సినిమాలు వదులుకోను.
టీచర్ వృత్తి నుంచి సినిమాలకు వచ్చారు. ఆ ప్రయాణం గురించి?
మా నాన్నగారు సాంబిరెడ్డి నిజాయితీ గల పోలీసాఫీసర్. ఆయన ఆల్ ఇండియా కబడ్డీ చాంపియన్. స్పోర్ట్స్ కోటాలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జాబ్ వచ్చింది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా చేశారు. డీఎస్‌పీగా, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. లంచం తీసుకోని వ్యక్తి. మా నాన్నగారితో పాటు చేసినవాళ్లందరూ బాగా సంపాదించుకున్నారు. కానీ, మా తాతగారు సంపాదించినది 90 శాతం అమ్మేశారు నాన్నగారు. అంతటి సిన్సియర్ పోలీసాఫీసర్. మామూలుగా చాలామంది ఇళ్లల్లో నాటకాల్లో నటిస్తే తిడతారు. కానీ, మేం ఎప్పుడైనా పదిరోజులు నాటకాలు వేయకపోతే నాన్నగారు తిట్టేవారు. నేను, నా ఇద్దరు తమ్ముళ్లు, నా చెల్లెలు.. లంచం తీసుకునే ఉద్యోగాలు చేయకూడదన్నది నాన్నగారి నిర్ణయం.
నేను డిగ్రీ పాసవ్వగానే.. కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, రైల్వేశాఖల్లో నాకు జాబ్ వచ్చింది. కానీ, నాన్నగారు వద్దన్నారు. ఉపాధ్యాయుడిగా చేయమన్నారు. ఆయన కోరిక ప్రకారమే మున్సిపల్ హై స్కూల్‌లో టీచర్‌గా చేరాను. చాలా మనస్ఫూర్తిగా పని చేశాను. ఆ తర్వాత హెడ్‌మాస్టర్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాను. మా నాన్నగారు ఎప్పుడూ ‘ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్’ అని ఓ స్లోగన్ చెబుతుండేవారు. నేనలానే ఉంటాను. అందుకే ఇప్పటివరకు నాకు బీపీ లేదు. మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి ఆత్మసంతృప్తి. అందుకే ఆయన్ను నిత్యం స్మరించుకుంటుంటాను.
Advertisement
Advertisement