‘‘నాలుగు సినిమాలు ఒకేసారి చేయగల సత్తా నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నా కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చేయగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలను కోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని పూజాహెగ్డే అన్నారు. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే విలేకరులతో పంచుకున్న విశేషాలు...
►స్క్రిప్ట్ బాగా నచ్చడం, నాది బలమైన పాత్ర కావడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. త్రివిక్రమ్ గారి నుంచి ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఆయనకు అహం లేదు.
►బన్ని, నేను ఇప్పటికి రెండు సినిమాలు చేశాం. దాంతో మా మధ్య సెట్స్‌లో కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లేనేమో నాతో మూడోసారి నటించాలని ఉందని అల్లు అర్జున్ అన్నారు.
►ఈ చిత్రంలోని అమూల్య పాత్రతో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల నా నటన మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్‌ని పెట్టుకోలేదు. నా మేనేజర్‌తో, నా స్టాఫ్‌తో తెలుగులోనే మాట్లాడుతాను. ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది.
►ఏదైనా మనం చేసే దృష్టిలో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ కాళ్లను హీరో పదే పదే చూస్తుంటాడు. అలా చూడ్డం వల్గర్‌గా ఏమీ లేదు. అలా ఎందుకు చూస్తాడో.. సినిమా చూస్తే అర్థమౌతుంది. ఈ సన్నివేశాలను జస్టిఫై చేశాం.
►‘అరవింద సమేత’ చిత్రానికి కూడా నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. మన పాత్రకి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది.. అలాంటి నటన నాకిష్టం ఉండదు. కొంతమంది మన నటనను తమ డబ్బింగ్‌తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను.
►‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో ‘బుట్టబొమ్మ..’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సన్నివేశం కూడా ఇష్టం. ఆ రెండూ చాలా సరదాగా ఉంటాయి.
►హిందీ ‘హౌస్ ఫుల్ 4’ చిత్రంలో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్‌తో, సగం రితేశ్ దేశ్‌ముఖ్‌తో చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు.. ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రానికి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మన పాత్రను ఎలా రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా.
►హిందీలో నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడెంట్‌గా, కార్పొరేట్ గాళ్‌గా ఆదరించారు. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో బన్నీ బాస్ రోల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఒప్పుకోవడం సంతోషం.. అందుకు నా పర్సనాలిటీ నా బలమని నమ్ముతాను.
►తెలుగులో లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ వచ్చింది కానీ, ఒప్పుకోలేదు. కథ నాకు నచ్చి, చేయగలననిపిస్తే చేస్తా. అలాంటి సినిమాలు ఒక నటిగా నన్ను మరో కోణంలో చూపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment