ఎన్.శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం?
కమల్‌హాసన్ హీరోగా ఎన్. శంకర్ ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారా?... ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఇది చిన్న బడ్జెట్ సినిమా కాదని, దాదాపు 60 కోట్ల రూపాయలతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున రూపొందనుందని టాక్. ఇప్పటికే ఈ చిత్రకథను కమల్‌కి ఎన్.శంకర్ వినిపించారట.
ఈ కథాంశం కమల్‌కి నచ్చిందని, కాకపోతే కొన్ని మార్పులు సూచించారని వినికిడి. కమల్ ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చిన్న విషయం కాదు. అంగీకరించడంతో పాటు సలహాలు కూడా సూచించారంటే తప్పకుండా శంకర్ డెరై క్షన్‌లో ఆయన సినిమా చేయడం ఖాయమని ఊహించవచ్చు. కథానాయకుడిగా తన నలభై ఏళ్లల్లో పలు వైవిధ్యభరితమైన పాత్రలు చేశారు కమల్. ఇన్నేళ్లల్లో ఆయన చేయనటువంటి పాత్రను క్రియేట్ చేశారట శంకర్.
నాయకుడు, విచిత్ర సోదరులు, భామనే సత్య భామనే, గుణ, భారతీయుడు... ఇలా పలు రకాల లుక్స్‌లో కనిపించిన కమల్‌ని ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారట. ఇదొక యాక్షన్ అడ్వంచర్ మూవీ అని, ఇందులో లవ్‌స్టోరీ కూడా ఉంటుందని తెలిసింది. సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. ఈ చిత్రం గురించి కమల్‌తో మరోసారి చర్చలు జరపబోతున్నారట శంకర్. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.