ప్రేమ చాలు పెళ్లొద్దు
ప్రేమ చాలు.పెళ్లి అవసరం లేదు అంటున్నారు నటి నమిత. 2003లో ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి దిగుమతి అయిన సూరజ్ బ్యూటీ నమిత. 13 ఏళ్లుగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, గుజరాతీ, ఆంగ్లం మొదలగు ఆరు భాషల్లో నటిస్తూ అశేష ప్రేక్షకులను తన అందచందాలతో అలరిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ 45 చిత్రాల్లో నటించిన నమిత అన్నిటిలోనూ అధికంగా అందాలనే ప్రదర్శిస్తూ అభిమానుల కలల రాణిగా వారిని గిలిగింతలు పెట్టించారు. చిన్న గ్యాప్ తరువాత కొత్త అందాలతో వినూత్న కథాపాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
పొట్టు అనే చిత్రంలో అఘోరిగా నటిస్తున్నారు. భరత్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.ఈ సందర్భంగా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఈ తరం కథానాయికలతో పోటీగా తయారైన నమిత ఏమన్నారో చూద్దాం. 13 ఏళ్లుగా నా మచ్చాన్‌గళ్( అభిమానులు) నా గ్లామర్‌ను ఆస్వాదిస్తూ వస్తున్నారు.అయితే తినగ తినగ గారెలు చేదైనట్లు ఎప్పుడూ బిరియానీ తిన్నా మొఖంమొత్తడం ఖాయం.అందుకే విభిన్న పాత్రలు పోషించాలని కోరుకున్నాను. అలాంటి పాత్రను పొట్టు చిత్రంలో పోషించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నా శరీర చాయను నల్లగా మార్చుకుని నటించనున్నాను. ఇందుకోసం దుబాయ్ వెళ్లి ఒంటి రంగును మార్చుకోనున్నాను.
అది మూడు నెలల వరకూ ఉంటుంది. ఆ తరువాత మళ్లీ అసలు రంగు వచ్చేస్తుంది.నేను కష్టపడాల్సిన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో తరసు చుట్టలు తాగాల్సి ఉంది.నా అభిమానులతో తరచూ ట్విట్టర్‌లో మాట్లాడుతూ ఉంటాను. వారిలో చాలా మంది నన్ను పేమిస్తున్నానని అంటుంటారు. అలా వారి ప్రేమ చాలు.పెళ్లి అవసరం లేదు. జీవితాంతం నటిగానే కొనసాగాలను కుంటున్నాను.అందుకే 86 కేజీల బరువు పెరిగిన నేను ఇప్పుడు 73 కేజీలకు తగ్గాను. ఇంకా ఎనిమిది కేజీలు తగ్గుతాను. సాధారణంగా నాకు దెయ్యాలంటే భయం లేదు. దెయ్యం ఇతి వృత్తంతో కూడిన పొట్టు చిత్రంలో నటించనుండడం థ్రిల్లింగ్‌గా ఉంది.