ఇదేంటీ ఇలా జరిగింది!
నటి నమిత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి యువత కలల రాణి. మచ్చాస్(బావలూ)అని నమిత అనగానే ప్రేక్షకుల నుంచి ఉత్సాహం ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది. నేటికీ బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు నమిత వస్తున్నారంటే జనం ఆమెను చూసేందుకు ఎగబడతారు. అంత క్రేజ్ ఉన్న నమిత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నారు. అయితే నమిత మాత్రం మరో ప్రయత్నం చేశారు. అదే రాజకీయరంగం ప్రవేశ నిర్ణయం.
అయితే గురజాతీ బ్యూటీ అయిన నమితకు రాజకీయ ఆశ కలగడంతో తన రాష్ట్రానికి చెందిన నరేంద్రమోదీ ప్రధాని కావడంతో బీజేపీ పార్టీలో చేరతారని చాలా మంది భావించారు. అయితే వారి ఊహలను తలకిందులు చేస్తూ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఇది జరిగిన కొద్ది రోజులకే జయలలిత మరణించడం, అన్నాడీఎంకే పార్టీ పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు అంటూ రెండుగా చీలిపోవడంతో ఏ వర్గం వైపు చేరాలన్న కన్ఫ్యూజన్‌కు గురైన నమిత తన రాజకీయ జీవితం ఆదిలోనే ఇలా అయిపోయిందేమిటని కలత చెందారట.
దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు. ఆ మధ్య మలయాళంలో మోహన్‌లాల్‌తో నటించిన పులిమురుగన్ మంచి విజయాన్ని సాధించడం నమితకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంలో పొట్టు తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో మళ్లీ నటిగా ఒక రౌండ్ కొట్టాలన్న ప్రయత్నంలో నమిత ఉన్నట్లు సమాచారం.