బాలయ్య కోసం రుద్రాక్ష పక్కన పెడతాడా..?
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. 99వ సినిమాగా డిక్టేటర్ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా, ఇంతవరకు 100వ సినిమాకు దర్శకుడు మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా, ఎవరితో సినిమా చేస్తున్నదీ మాత్రం బాలయ్య ప్రకటించలేదు. తాజాగా ఈ లిస్ట్లో మరో స్టార్ డైరెక్టర్ వచ్చి చేరాడు.
డిక్టేటర్ సినిమా తరువాత బాలయ్య వందో సినిమాగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369కు సీక్వల్ను తెరకెక్కించాలని భావించారు. దాదాపుగా కన్ఫామ్ అయిన ఈ ప్రాజెక్ట్ను ఆఖరి నిమిషంలో బాలకృష్ణ పక్కకు పెట్టాడు. బాలయ్యకు భారీ సక్సెస్లు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ప్లాన్ చేసినా ఇప్పట్లో బోయపాటి డేట్స్ దొరికే పరిస్థితి లేదు.
అందుకే పటాస్ ఫేం అనీల్ రావిపూడి, కంచె సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రిష్ల పేర్లు కూడా బాలకృష్ణ వందో సినిమా రేసులో వినిపించాయి. అయితే వీరిలో ఎవరి పేరును అఫీషియల్గా ప్రకటించలేదు. తాజాగా స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య వందో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కృష్ణవంశీ కథకు ఓకే చెప్పిన బాలకృష్ణ.. వెంటనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని సూచించాడట. మరి ఇప్పటికే రుద్రాక్ష సినిమాను ప్రకటించిన కృష్ణవంశీ, బాలకృష్ణ కోసం ఆ ప్రాజెక్ట్ను పక్కన పెడతాడేమో చూడాలి.