పోలీస్ థ్రిల్లర్...
ఫ్లాష్.. ఫ్లాష్....
సృజనాత్మక దర్శకుడిగా పేరొందిన కృష్ణవంశీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాలకృష్ణ 100వ చిత్రంగా ‘రైతు’ ప్రాజెక్ట్‌ను రూపొందించే అవకాశం కృష్ణవంశీకి వచ్చినట్లు ఆ మధ్య కృష్ణానగర్ గుప్పుమంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో చారిత్రక కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనుకోకుండా తెర మీదకు వచ్చింది. దాంతో, కృష్ణవంశీ సారథ్యంలోని ‘రైతు’ ప్రాజెక్ట్‌ను తన 101వ సినిమాగా బాలకృష్ణ చేయాలనుకుంటున్నట్లు ఆంతరంగిక వర్గాల కథనం. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ తక్షణమే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
దాని గురించి ‘సాక్షి’ ఆరా తీస్తే, ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ‘గోవిందుడు అందరి వాడేలే’ తరువాత కొంతకాలంగా రకరకాల స్క్రిప్ట్‌లు తయారుచేసుకుంటూ కృష్ణవంశీ బిజీగా గడిపారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ, వివిధ భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ భారీ చిత్రాన్ని తీయాలని మొదట్లో ఆయన అనుకున్నారు. అయితే, మరింత సమయం పట్టే ఆ కథను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఒక పోలీస్ యాక్షన్ స్టోరీని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు.
ఒక యువ పోలీసు అధికారి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారీ బడ్జెట్ వాణిజ్యపంథా చిత్రానికి యువ హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నారు. ఊహించని అనేక ట్విస్టులు, కావలసినంత నాటకీయత, బోలెడన్ని యాక్షన్ సన్నివేశాలు - ఈ కథలో ఉంటాయట. ‘‘పోలీస్ నేపథ్యంలో చాలా వాస్తవికంగా ఉండే కథ ఇది. చాలా రోజులుగా మదిలో మెదులుతున్న ఈ స్క్రిప్ట్ సందీప్ కిషన్‌తో అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారు.
ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు, హీరో చాలా ఉత్సాహంగా ఉన్నారు’’ అని ఆంతరంగిక వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణవంశీ పరిచయం చేసిన ఒక హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్ర ధరిస్తున్నారు. మరో హీరోయిన్‌ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అలాగే, పరభాషకు చెందిన ఒక ప్రముఖ కథానాయకుడు గౌరవపాత్ర ధరించనున్నారు. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌కు కావాల్సిన పోలీస్ అనుమతులు, వగైరాల కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే పనులు ప్రారంభించింది.
ఈ నెల 27 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే షూటింగ్ జరిగే ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం వహించనున్నారు. ఈ హాలీవుడ్ తరహా థ్రిల్లర్‌ను శరవేగంతో పూర్తిచేసి, ఆగస్టు 15కి కానీ, దసరాకి కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరిన్ని వివరాల కోసం, క్రియేటివ్ దర్శకుడి కొత్త వెండితెర విశ్వరూపం కోసం మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!