అనీల్ ఆశ వదులుకున్నట్టేనా..?
పటాస్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించిన అనీల్, అదే జోరులో మెగా హీరో సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం సాయి ధరమ్తేజ్ హీరోగా సుప్రీమ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పట్టాల మీద ఉండగానే ఓ సీనియర్ హీరోతో భారీ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
99 సినిమాలు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమాను, తనే డైరెక్ట్ చేయాలని ఆశపడ్డాడు యువ దర్శకుడు అనీల్ రావిపూడి. రామారావుగారు అనే టైటిల్తో బాలయ్యకు ఓ లైన్ కూడా వినిపించాడు. బాలకృష్ణకు కూడా లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్తో రమ్మన్నాడన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా బాలయ్య తన వందో సినిమా విషయంలో కీలక ప్రకటన చేయటంతో అనీల్ ఆలోచనలో పడ్డాడు.
తన వందో సినిమా క్రిష్ లేదా కృష్ణవంశీలతో ఉంటుందంటూ ప్రకటించాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే సింగీతం శ్రీనివాస్తో ఆదిత్య 369కు సీక్వల్ కూడా ఉంటుందంటూ చాలా రోజులుగా చర్చ జరగుతుంది ఈ రెండు సినిమాలు పూర్తవ్వటానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అంటే ఈ రెండేళ్లలో బాలయ్యతో అనీల్ సినిమా లేనట్టే. మరి ఆ తరువాతైనా అనీల్కు బాలయ్య ఛాన్స్ ఇస్తాడో..? లేదో..?