చాలా గర్వపడుతున్నాను - నాని
చాలా గర్వపడుతున్నాను - నాని
Published Wed, Jan 29 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
‘‘దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్. చిన్నప్పట్నుంచీ వారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ సంస్థలో హీరోగా నటించినందుకు చాలా గర్వపడుతున్నాను’’ అని నాని అన్నారు. నాని, వాణీకపూర్ జంటగా గోకుల్‌కృష్ణ దర్శకత్వంలో యశ్‌రాజ్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘ఆహా కళ్యాణం’. ఆదిత్య చోప్రా నిర్మాత. ధరన్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’రాజు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సునీల్‌కి అందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ -‘‘దర్శకుని సున్నితత్వం చూసి ‘ఏం తీస్తాడో...’ అనుకున్నాను. కానీ షూటింగ్ మొదలైన రెండో రోజే అతని ప్రతిభ ఏంటో తెలిసింది. అందరి అభిప్రాయాలూ తీసుకొని జనరంజకంగా సినిమా తీశారు.
‘బ్యాండ్‌బాజా బారాత్’ చిత్రానికి ఇది రీమేక్ అయినప్పటికీ... మన నేటివిటీ ఎక్కడా మిస్ కాదు. వాణీకపూర్‌కి తెలుగు రాకపోయినా... అర్థం చేసుకుని నటించింది. పేరుకు తగ్గట్టుగా సందడిగా సాగే సినిమా ఇది’’ అని చెప్పారు. 40 ఏళ్లుగా హిందీ చిత్రరంగంలో ఉన్న తాము తొలిసారిగా తెలుగు, తమిళ సినీ రంగాల్లో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతినిధి పదమ్‌కుమార్ అన్నారు. యశ్‌రాజ్ సంస్థలో పనిచేయడం గర్వంగా ఉందని, అందరికీ నచ్చే క్లీన్ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ‘‘ఈ సంస్థలో నాకిది రెండో సినిమా. నేను, నాని ఇందులో వెడ్డింగ్ ప్లానర్లుగా నటించాం. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అని వాణీకపూర్ ఆకాంక్షించారు. రానా, కృష్ణచైతన్య, కరుణాకరన్ తదితరులు కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement