టైటిల్ : నవాబ్
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
తారాగణం : అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, ఏ సుధాకరన్
లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నారు. ఓకె బంగారం సినిమాతో ఆకట్టుకున్నా తరువాత చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచారు. అయితే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మణి సినిమాలపై క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అందుకే నవాబ్ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను మణిరత్నం అందుకున్నారు..? రొమాంటిక్ జానరను పక్కన పెట్టి తన పాత స్టైల్ క్రైమ్ థ్రిల్లర్‌తో సక్సెస్ సాధించారా..?
కథ ;
భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) సమాంతర ప్రభుత్వంగా ఎదిగిన మాఫియా లీడర్. ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వరద (అరవింద్ స్వామి) గ్యాంగ్ స్టార్‌గా తండ్రి తరువాత ఆ స్థానం కోసం ఎదురుచూస్తుంటాడు. రెండో కొడుకు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్‌లో.. మూడో కొడుకు రుద్ర(శింబు) సెర్బియాలో వ్యాపారాలు చేస్తుంటారు. ఒక రోజు భూపతి రెడ్డి మీద ఫేక్ పోలీసులు ఎటాక్ చేస్తారు. దీంతో అన్నదమ్ములంత తండ్రి దగ్గరకు వస్తారు. భూపతి రెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా భూపతి రెడ్డి ప్రత్యర్థి చిన్నప్ప అల్లుడిని చంపటంతో గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. కానీ భూపతి రెడ్డి తన మీద ఎటాక్ చేసింది చిన్నప్ప కాదని చెపుతాడు. దీంతో కొడుకులే ఆధిపత్యం కోసం భూపతి రెడ్డి మీద ఎటాక్ చేశారన్న అనుమానం కలుగుతుంది. అదే సమయంలో భూపతి రెడ్డి చనిపోతాడు. దీంతో అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరి అనుమానం కలుగుతుంది. ఆదిపత్య పోరు మొదలవుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..? ఎవరు మిగిలారు..? అసలు భూపతి రెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరు.? రసూల్ (విజయ్ సేతుపతి)కి భూపతి రెడ్డి కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.
నటీనటులు ;
మణిరత్నం సినిమా అంటే నటీనటులకు వంక పెట్టడానికి ఉండదు. తన పాత్రలకు పూర్తి న్యాయం చేయగలిగిన నటులను మాత్రమే తీసుకుంటాడు మణి. అదే ఫార్ములాను నవాబ్‌లోనూ ఫాలో అయ్యాడు. ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప అంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. భూపతి రెడ్డిగా ప్రకాష్ రాజ్ జీవించాడు. అరవింద్ స్వామి కెరీర్‌లో వరద మరో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. క్రైమ్ థ్రిల్లర్‌గా సీరియస్ నోట్ లో సాగే సినిమాకు విజయ్ సేతుపతి కామెడీ టచ్ ఇచ్చాడు. శింబు, అరుణ్ విజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో జయసుధ, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీ రావ్ హైదరీ, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ ;
చాలా రోజుల తరువాత ఓ భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందు వచ్చారు దర్శకుడు మణిరత్నం. సినిమాను ఇంట్రస్టింగ్ సీన్స్ తో స్టార్ట్ చేసిన దర్శకుడు అసలు కథను వెంటనే మొదలు పెట్టాడు. ఓపెనింగ్‌లోనే భూపతి రెడ్డి మీద ఎటాక్, తరువాత ఇతర పాత్రల పరిచయం, ఎటాకర్స్ కోసం వేట లాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ రేసీగా సాగుతుంది. అయితే ఆ వేగం ద్వితీయార్థంలో మిస్ అయ్యింది.నటీనటుల సెలక్షన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాత్రల ఎంపికలోనే కాదు వారి నుంటి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా టాప్ టెక్నిషియన్స్ పనిచేసినా.. ప్రేక్షకులకు మణిరత్నం మార్క్ మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ముఖ్యంగా గ్యాంగ్ వార్స్ సన్నివేశాలు చాలా సాధాసీదాగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ ;
లీడ్ యాక్టర్స్ నటన
నేపథ్య సంగీతం
కథనంలో మలుపులు
మైనస్ పాయింట్స్ ;
మణిరత్నం మార్క్ కనిపించకపోవటం
సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్
Comments
Please login to add a commentAdd a comment