మరోసారి బాలయ్యకు జోడిగా..!
సీనియర్ హీరోల్లో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య, మరిన్ని సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం తన 101వ సినిమాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసావసూల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ను స్టార్ చేయనున్నాడు.
తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్లతో వరుస సక్సెస్లు సాధించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జయసింహా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
సింహా పేరుతో బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి అదే సెంటిమెంట్ను ఈ సినిమాకు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు బాలయ్య సరసన సింహా, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్న నయనతారను ఈ సినిమాకు హీరోయిన్గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్లో బిజీగా ఉన్న నయన్, బాలయ్య సినిమాలో నటించేందుకు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.