Nayanthara Marriage Date, Fix: నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది! | Vignesh Shivan - Sakshi
Sakshi News home page

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!

Published Thu, Sep 26 2019 9:52 AM | Last Updated on Thu, Sep 26 2019 3:29 PM

Nayanthara and Vignesh Shivan Getting Married Soon - Sakshi

దక్షిణాదిలో అగ్ర కథానాయకి నయనతార అయితే, తమిళసినిమాలో సంచలన జంట దర్శకుడు విఘ్నేశ్‌శివన్, నయనతారనే. దాదాపు అర్ధ దశాబ్దానికి పైగా ప్రేమ, సహజీవనం అంటూ వార్తల్లో నిలుస్తున్నారీ జంట. వీరిద్దరిలో ఏ ఒక్కరికి సంబంధించిన విశేషం అయినా కలిసి వేడుకగా జరుపుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అదేవిధంగా సమస్యల్లోనూ ఒకరికొకరు అండగా నిలబడుతున్నారు.

ఆ మధ్య సీనియర్‌ నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, అందుకు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ ఘాటుగానే స్పందించాడు. నయనతారను తన దేవతగా భావిస్తూ ఆమె ప్రతి అడుగులోనూ అడుగేస్తున్నాడు. అయితే వీరి సహజీవనం గురించి రకరకాల వదంతులు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మధ్య నయనతార తన ప్రియుడికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిందనే ప్రచారం కూడా జరిగింది.

తాజాగా తన ప్రియుడ్ని నిర్మాతగా చేసింది నయన్‌. అవును విఘ్నేశ్‌శివన్‌ రౌడీ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించనున్న  నెట్టికన్‌ చిత్రంలో నయనతార నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఏకంగా ఆయనకు భర్త పాత్రను ఇవ్వడానికి నయనతార సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ సంచలన జంట పెళ్లి వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. అయితే వాటికి పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు.

అయితే ఆ మధ్య ఒక జోతీష్యుడు నయనతార పెళ్లి డిసెంబర్‌ నెలలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం పరిణామాలను చూస్తుంటే విఘ్నేశ్‌శివన్, నయనతారల వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవును వీరి పెళ్లి వచ్చే డిసెంబర్‌ 25న జరగనుందనే టాక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ జంట వివాహ వేడుకలు 5 రోజుల పాటు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వేడుకలు చెన్నైలోనూ, కేరళలోనే కాదట. ఉత్తరాదిలోనో, లేక విదేశాల్లోనూ క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా జరుపుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే దీని గురించి ఈ సంచలన జంట నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement