
సాహసానికి సై!
ఇప్పటివరకూ అభినయం, అందం... ఈ రెండిటికే ప్రాధాన్యమిస్తూ దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ల దృష్టి ఇప్పుడు సాహసాల మీదకు మళ్లింది. ఇప్పటికే అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల కోసం గుర్రపుస్వారీ, యుద్ధవిద్యలు నేర్చుకొని తెరపై వీరత్వాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. తమన్నా కూడా... ‘బాహుబలి’ కోసం యుద్ధ విద్యలు అభ్యసించారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. ఆమె కూడా యాక్షన్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోనున్నారట. తమిళంలో ‘జయం’రవితో ఆమె నటిస్తున్న ‘తని ఒరువన్’ సినిమాలో నయన డైనమిక్ పోలీస్ అధికారిగా నటిస్తు న్నారు. ఈ కసరత్తులన్నీ ఆ పాత్ర కోసమే. అంతేకాక... మాజీ పోలీస్ అధికారి కిరణ్‌బేడీతో సహా పలువురు మహిళా పోలీసుల్ని స్టడీ చేస్తున్నారట నయన.