
తమిళసినిమా: హీరోలను అభిమానులే కాదు, హీరోయిన్లు అభిమానిస్తారు. అయితే కొందరు హీరోయిన్ల అభిమానంలో స్వప్రయోజనాలు ఉండవచ్చు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా అభిమానించే హీరోయిన్లు ఉండరా? అంటే నటి నయనతార లాంటి వారు ఉంటారని ఈ కింది విషయాన్ని చూస్తే మీరే అంటారు. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటి నయనతార. ఆమె ఒక చిత్రంలో నటించాలంటే హీరోకు దీటుగా పాత్ర ఉండాలి. లేకపోతే హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అయినా అయ్యి ఉండాలి. అలాంటి కథా చిత్రాలైతేనే నయనతార అంగీకరిస్తారు. ఆమె అభిమానులు అలాంటి పాత్రలనే కోరుకుంటారు. ఈ అగ్రనటికి నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే ఎంతగానో. అజిత్‌తో నయనతార ఇప్పటికే మూడు చిత్రాల్లో కలిసి నటించింది. హిట్ పెయిర్‌గా పేరొందిన ఈ జంట తాజాగా విశ్వాసం చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిజం ఉన్న ఈ చిత్రంలో నటించడానికి నయనతార అంగీకరించడమే విశేషంగా భావిస్తున్నారు.
ఎందుకంటే అజిత్ పెద్ద స్టార్. అందులోనూ విశ్వాసం చిత్రంలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ చిత్రంలో నయనతార పాత్రకు అంతగా ప్రాముఖ్యత ఉంటుందని ఆశించలేం. అయితే ఈ విషయం తెలిసి కూడా నయనతార విశ్వాసం చిత్రంలో నటించడానికి అంగీకరించింది. సాధారణంగా ఆమె కథ విని నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతుంది. ఇటీవల తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివతో కూడా తాను నటించే కథా పాత్రల గురించి చర్చించి సలహాలు తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఉండగా విశ్వాసం చిత్రంలో నటించమని దర్శకుడు శివ అడగ్గానే వెంటనే ఓకే అనేసిందట. కథేంటని, తన పాత్ర ఏంటని ఒక్క మాట కూడా అడగలేదట. ఇకపోతే ఈ సంచలన తార కోట్లల్లో పారితోషికం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే.
అలాంటిది విశ్వాసం చిత్రంలో నటించడానికి పారితోషికం గురించి చర్చించలేదట. డేట్స్ కూడా సర్దుబాటు చేస్తానని చెప్పిందట. ఇంతగా విశ్వాసం చిత్రం కోసం రాయితీలు ఇవ్వడానికి ఒకేఒక్క కారణం నటుడు అజిత్ అట. తనకు నచ్చిన నటుడు అజిత్ అని నయనతార బహిరంగంగానే చెప్పింది. అయితే ఆయనంటే ఎంత అభిమానం అన్నది ఇప్పుడే అర్థం అవుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విశ్వాసం చిత్రం రెండో షెడ్యూల్‌ను ఈ నెల 22 నుంచి ముంబైలో చిత్రీకరించేందుకు రెడీ అవుతోంది. వివేగం తరువాత సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అజిత్‌తో నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది అన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment