ముందు నాకూ అర్థం కాలేదు... వింతగా అనిపించింది!
‘‘థియేటర్‌లో సినిమా స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉంటే ప్రేక్షకులు మూవీ పోస్టర్లను చూస్తుంటారు. క్యాంటీన్‌కు వెళుతుంటారు. ఇప్పుడు ఈ ఆగ్‌మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీతో కూడిన స్టాండీలు వచ్చిన తర్వాత తమ అభిమాన స్టార్లతో ప్రేక్షకులు ఫొటోలు దిగే అవకాశం ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు.
రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్ చౌదరి, వి. కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆగ్‌మెంటెడ్ రియాల్టీ అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ గురించి హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ముందు ఈ టెక్నాలజీ నాకు అర్థం కాలేదు. వింతగా అనిపించింది. మాములు స్టాండీలకు (సినిమా పోస్టర్లు), ఆగ్‌మెంటెడ్ స్టాండీలకు తేడా ఉంది.
ఫస్ట్ టైమ్ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ అగుమెంటెడ్ టెక్నాలజీతో కూడిన స్టాండీలను మణిశంకర్ అండ్ టీమ్ డెవలప్ చేశారు. ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఆడబోయే అన్ని థియేటర్లకు 650 స్టాండీలను పంపించడం జరిగింది. పేటెంట్ రైట్స్ మావి అని కాదు. మణిశంకర్ అండ్ టీమ్ చేస్తారు. మేం హెల్ప్ చేస్తున్నాం. మిగతా సినిమాల నిర్మాతలు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు.
‘‘ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌స్టార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌స్టార్‌లో ఉన్న స్కానింగ్ ఆప్షన్ ద్వారా ఆగ్‌మెంటెడ్ స్టాండీలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకున్న వెంటనే ఈ స్టాండీకి సంబంధించి లింకై ఉన్న వీడియోలో యాక్టర్లు వచ్చి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఎలా కావాలంటే అలా ఫొటోలు దిగవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి స్కానింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఆగ్‌మెంటెడ్ స్టాండీలపై ఉన్న క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి కూడా యాప్‌స్టార్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫొటోలు దిగవచ్చు. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. యాప్‌స్టార్‌లో ఉన్న ఆప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు’’ అని మణిశంకర్ అండ్ టీమ్ తెలిపారు.