బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో బంధుప్రీతి(నెపోటిజం)పై విస్తృత చర్చ లేవనెత్తింది. బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సుశాంత్‌కు ఇవ్వలేదన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎందరో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి తిరిగిన దర్శకుడు, చిత్ర నిర్మాత మహేశ్ భట్ కూడా ఒకరు. ఆయన బుధవారం సోషల్ మీడియాలో "సడక్-2" చిత్ర పోస్టర్‌ను విడుదల చేశాడు. హీరోయిన్ అలియాభట్ నటించిన ఈ సినిమా పోస్టర్ లుక్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదిలా ఉంటే సుశాంత్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ చిత్రాల్లో ఎంతవరకు నెపోటిజమ్ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు గురువారం "నెపోమీటర్"ను ప్రారంభించారు. ఇది ఐదు కేటగిరీలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్)
నిర్మాత, ప్రధాన పాత్రలు, ఇతర పాత్రలు, దర్శకుడు, రచయిత ఆధారంగా సినిమాలో ఎంతమేరకు బంధుప్రీతి ఉందో నిరూపిస్తూ ఫలితాన్ని వెల్లడిస్తుంది. దీనికోసం సోషల్ మీడియాలో నెపోమీటర్ అని అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. అందులో అలియాభట్ సడక్-2 చిత్రం 98% నెపోటిస్టిక్ అని తెలిపింది. అంటే ఈ చిత్రంలో ఐదు కేటగిరీల్లోని నాలిగింట్లో బాలీవుడ్ ప్రముఖుల వారసులే ఉన్నారని స్పష్టం చేసింది. బాలీవుడ్‌లో నెపోటిజమ్ రూపుమాపాలన్న ప్రయత్నంతోనే దీన్ని ప్రవేశపెట్టామని సుశాంత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బయట నుంచి వచ్చేవారికి అవకాశాలు ఇవ్వని సినిమాలు చూడవద్దని అభిమానులను కోరారు. కాగా నెపోమీటర్ ఎక్కువ శాతాన్ని చూపిస్తే అది అందులో స్టార్ల కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నట్లు.. తక్కువగా చూపిస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారు సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు అర్థం. (సుశాంత్ ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు)
Comments
Please login to add a commentAdd a comment