పాపం పవిత్రం | Netflix backs 'Sacred Games' season 2 after probe | Sakshi
Sakshi News home page

పాపం పవిత్రం

Published Sat, Oct 27 2018 12:24 AM | Last Updated on Sat, Oct 27 2018 12:24 AM

Netflix backs 'Sacred Games' season 2 after probe - Sakshi

సినిమాల్లో, సీరియళ్లల్లో  జీవమున్నవే నటిస్తాయి! కానీ ఇందులో ఓ మహానగరానికి ప్రాణం పోశారు.. ఒక క్యారెక్టర్‌గా పిక్చరైజ్‌ చేశారు.. ప్రధాన భూమికగా.. దాని చుట్టే కథనం నడిపించారు! అదే ‘సేక్రెడ్‌ గేమ్స్‌’.. వెబ్‌ సిరీస్‌. ఆ ‘మహానగరమే’ ముంబై! పాప పవిత్రాలే థీమ్‌.

మల్టీ స్టోర్‌ బిల్డింగ్‌ మీద నుంచి ఓ పామరేనియన్‌ డాగ్‌ కిందపడి నేలకు అతుక్కుపోతుంది... బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న స్కూల్‌ పిల్లలు భయంతో బిక్కచచ్చిపోతారు.  ‘‘నా గ్యాంగ్‌లోని వాళ్ల మధ్య హిందూముస్లిం అనే తేడా లేదు. ఇప్పుడు మీరొచ్చి ఆ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టొద్దు. ఈ గోపాల్‌మuŠ‡ను శ్మశానంలా మార్చొద్దు’’ ‘‘నేను ఈజిప్ట్‌లో పుట్టిన టైమ్‌లోనే నువ్వు ముంబైలో పుట్టావు. అప్పుడే రాసి పెట్టాశాడు అల్లా.. మనిద్దరం ఇక్కడ ఇలా కలవాలని.. ’’ అంటూ టేబుల్‌కు కట్టేసి ఉన్న రెండు చేతుల్లోని ఒక చేయి బొటన వేలును నరికేస్తాడు.నేల మాళిగలో ఓ వ్యక్తి బందీగా ఉంటాడు. పైన  మొదటి వాక్యం ఓపెనింగ్‌ షాట్‌. మధ్యలోని రెండు వేరు వేరు సీన్లకు సంబంధించిన రెండు డైలాగులు. చివరిది లాస్ట్‌ షాట్‌! ఇవి ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనివి. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ఫస్ట్‌ ప్రొడక్షన్‌. మొదలవగానే పాపులర్‌ అయింది. టాప్‌ రేటింగ్‌కి వెళ్లిపోయింది.

అసలు కథ..
2006లో విక్రమ్‌ చంద్ర రాసిన నవల ‘‘సేక్రెడ్‌ గేమ్స్‌’’ ఆధారంగా చిత్రీకరించారు ఈ వెబ్‌సిరీస్‌ను. నవలలో కథాకాలం 1980, 90ల నాటిది. సిరీస్‌లో దాన్ని ఇప్పటి పరిస్థితులనూ కలిపారు.  ముంబై చుట్టే తిరుగుతుంది.. అనేకన్నా  ముంబై కూడా ఓ ప్రధాన భూమిక అంటే బాగుంటుంది.  ఒకరు దీన్ని ఆకాశ హర్మ్యాలున్న చెత్తకుండిగా చూస్తారు. ఇంకొకరికి ఇది.. తెల్లవార్లూ బిడ్డలను కాపుకాస్తున్న తల్లిలాంటిది. మరోకోణంలో..  కాలుష్యంతో మసకబారిన నింగి,నేలకు  మాఫియా మర్డర్లతో ఎరుపును అద్దే రంగుల కంచం. వెరుపు పుట్టించే బూచీ. ఈ వాతావరణం అక్కడున్న మనుషులకు ఒక్కో నేపథ్యాన్ని ఖాయం చేస్తుంది. అలాంటి భిన్న బ్యాక్‌గ్రౌండ్స్‌తో ఉన్న క్యారెక్టర్లే కనిపిస్తాయి సేక్రెడ్‌ గేమ్స్‌లో.  కాలంతో పందెం పెట్టుకున్న  క్రైమ్‌ థ్రిల్లర్‌.

త్రీ యాంగిల్స్‌.. త్రీ క్యారెక్టర్స్‌
మాఫియా, పోలీస్, రా.. త్రీ యాంగిల్స్‌. గణేశ్‌ గైతొండే, సర్తాజ్‌ సింగ్, అంజలీ మాథుర్‌..  త్రీ క్యారెక్టర్స్‌.



గణేశ్‌ గైతొండే (నవాజుద్దీన్‌ సిద్దిఖీ)... ఓ బ్రాహ్మణుడు.  యాచన చేస్తున్న  తండ్రి తీరు నచ్చదు. ఆ నైజం గైతొండే తల్లికీ నచ్చదు. చేతకాని తనంగా పరిగణిస్తుంది. ఇంకో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది.  తల్లి అంటే ఇష్టమున్న గైతొండే ఆమె ప్రవర్తనను అసహ్యించుకుంటాడు. కోపం తెచ్చుకుని ఓ రోజు తల్లిని, పక్కనున్న వ్యక్తినీ చంపేసి ఊరు వదిలి పారిపోతాడు. అప్పటికి అతని వయసు పదేళ్లు. మధ్యలో ఎన్నో దార్లు. గాడ్‌ ఫాదర్‌లు. అలా ముంబైలో సెటిల్‌ అవుతాడు. డంప్‌యార్డ్‌ను ఆక్రమించుకుని.. మద్యం మహారాజుగా ఎదిగి.. గ్యాంగ్‌స్టర్‌గా స్థిరపడ్తాడు. మారుతున్న ముంబై రాజకీయ,సాంఘిక పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు.   ఇసా అనే ముస్లిం గ్యాంగ్‌ లీడర్‌ తన గ్యాంగ్‌లోని హిందువులను టార్గెట్‌ చేసిన తర్వాత  కరడుగట్టిన హిందూ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు.

సర్తాజ్‌ సింగ్‌ (సైఫ్‌ అలీ ఖాన్‌).. సిన్సియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. అతని తండ్రి కూడా పోలీసే. వృత్తిలో తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంటాడు. కాని పరూల్కర్‌ అనే  పై అధికారి సర్తాజ్‌ను ‘‘అసమర్థ’’ ఇన్‌స్పెక్టర్‌గా నిరూపించే ప్రయత్నం చేస్తుంటాడు. కారణం.. సర్తాజ్‌ నిజాయితీ పరూల్కర్‌కు అడ్డంకిగా మారుతుంది. ఓ హత్యను ఎన్‌కౌంటర్‌గా మార్చి.. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తుంటాడు పరూల్కర్‌. ఒప్పుకోడు సర్తాజ్‌. అందుకే సర్తాజ్‌  ఏ కేస్‌ డీల్‌ చేస్తున్నా ఆటంకాలను సృష్టిస్తుంటాడు. సర్తాజ్‌ ముక్కుసూటి వ్యవహారం, కచ్చితత్వం అతని వైవాహిక జీవితంలోనూ సమస్యలను క్రియేట్‌ చేస్తుంది. దాంతో అతని భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. ప్రొఫెషనల్‌ అండ్‌ ఫ్యామిలీ లైఫ్‌లోని వైఫల్యాలతో సర్తాజ్‌ తీవ్ర అసంతృప్తికి లోనవుతాడు.  నిద్రలేమి బారిన పడ్తాడు. యాంటీ యాంగై్జటీ పిల్స్‌కు బానిసవుతాడు.

అంజలీ మాథుర్‌ (రాధికా ఆప్టే).. ‘రా’ ఏజెంట్‌. ఆమె తండ్రీ కూడా ‘రా’ ఉద్యోగే. ఏదో అసైన్‌మెంట్‌లో మిస్సింగ్‌గా ఉంటాడు. ఏళ్లు గడిచినా జాడ దొరకదు. రా వింగ్‌ అతను చనిపోయాడనే అనుకుంటుంది. ఆ మాటను అంజలీ ఒప్పుకోదు. ఎక్కడో తన తండ్రి బతికే ఉన్నాడనే భరోసా ఆమెకు. అన్ని చోట్లలాగే ‘రా’లో కూడా జెండర్‌ డిస్క్రిమినేషన్‌ను ఫేస్‌ చేస్తుంటుంది. అసైన్‌మెంట్స్‌లోని కేస్‌లతో పాటు ఆ వివక్ష మీదా పోరాటం చేస్తుంటుంది అంజలీ.ఈ ముగ్గురు కాక త్రివేది అనే ఓ పాత్రా కథలో బలంగా వినపడుతుంది. గైతొండే, సర్తాజ్, అంజలివి వేరు వేరు ప్రపంచాలు. వేరువేరు ఉద్యోగాలుగా కనిపిస్తున్నా కామన్‌ కనెక్షన్‌ క్రైమ్‌. ఇంకో సారూప్యత.. ఈ ముగ్గురూ ‘డాడీ ఇష్యూస్‌’తో ఉన్నవారే. అంటే తండ్రులకు సంబంధించి ఏదో ఒకరకమైన ప్రభావంతో పెరిగినవారే.

పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఉన్నప్పుడే  గైతొండే నుంచి ఫోన్‌ వస్తుంది సర్తాజ్‌కు. ఆ ఫోన్‌ ట్రాక్‌ చేస్తూ చేస్తూ అతను ఉన్న  చోటికి చేరుకుంటాడు.  ‘‘బాంబే న్యూక్లియర్‌ త్రెట్‌లో ఉంది. దాన్నుంచి నగరాన్ని కాపాడ్డానికి 25 రోజుల టైమే ఉంది. త్రివేది మాత్రం తప్పించుకుంటాడు’’ అని సర్తాజ్‌తో చెప్పి అతని ముందే  పిస్టోల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు గైతొండే. అప్పటి నుంచి సర్తాజ్‌ అన్వేషణ మొదలవుతుంది.. ఆ త్రెట్‌ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి రూపకర్త ఎవరు? ఎలా ఆపాలి? ఇంతకీ ఆ త్రివేది ఎవరు.. ఎట్‌సెట్రా ఎట్‌సెట్రా!

ఈ హింట్స్‌తో ఐఎస్‌ఐకి  ఏదైనా సంబంధం ఉందా అని ఇటు రా ఏజెంట్‌ అంజలీ కూడా ఈ దర్యాప్తు చేపడుతుంది. యాజ్‌యూజవల్‌గా సర్తాజ్‌ ముందుకు వెళ్లకుండా ముల్లులు గుచ్చుతునే ఉంటాడు పరూల్కర్‌. అయినా తన ఎఫర్ట్‌ను ఆపడు సర్తాజ్‌. గైతొండే ఇచ్చిన లీడ్‌ను ఛేదించే క్రమంలో మారణాయుధాల స్మగ్లింగ్‌లో సెంట్రల్‌ హోమ్‌మినిస్టర్‌ హస్తమున్నట్టూ తెలుస్తుంది. ఇంకోవైపు సర్తాజ్‌ ఇన్వెస్టిగేషన్‌తో ఇంప్రెస్‌ అయిన అంజలి అతనికి  ఓ టాస్క్‌ అప్పజెప్పుతుంది. దాన్నీ విజయవంతంగా పూర్తి చేస్తాడు సర్తాజ్‌.  ఈలోపు  తనను దేశం దాటిస్తే  త్రివేది ఆచూకి చెప్తానని గైతొండే అనుచరుడు బంటీ.. అంజలీతో ఒప్పందానికి వస్తాడు. అది తెలియని సర్తాజ్‌ ..  బంటీ పారిపోతున్నాడనుకుని అతనిని  కాల్చే ప్రయత్నం చేస్తాడు.

ఈ గలాటలో లారీ కింద పడి చనిపోతాడు బంటీ. మంచి క్లూని మిస్‌ చేశాడని అంజలి, పరూల్కర్‌లు సర్తాజ్‌ మీద అసహసంగా ఉంటారు. ఈ ఎంక్వయిరీ నుంచి సేఫ్‌గా బయటపడాలనుకుంటే   ఎన్‌కౌంటర్‌కి సంబంధించి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు పరూల్కర్‌. ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు సర్తాజ్‌కు. ఈలోపు ముంబై త్రెట్‌లో ఐఎస్‌ఐ హ్యాండ్‌ ఉందేమోనని తేల్చుకునేందుకు  ఒక అడుగు ముందుకేసిన అంజలి ఓ అజ్ఞాత వ్యక్తి చేతిలో హత్యకు గురవుతుంది.  అతను  ఎవరో కాదు.. మారణాయుధాలను సరాఫరా చేస్తున్న స్మగ్లరే అని తేలుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు టీవీలో ఇస్తున్న ప్రవచనాల్లోని ఓ మాట, కనిపిస్తున్న యంత్రం చిహ్నం ఆధారంతో త్రివేది ఉన్న ప్రాంతాన్ని కనుగొంటాడు సర్తాజ్‌. నేలమాళిగలో బందీగా పడి ఉన్న వ్యక్తి అతడే. ఇంకా ఆ మాళిగలో పేలే పదార్థాలూ ఉంటాయి. అక్కడితో ఎనిమిది ఎపిసోడ్‌ల సేక్రెడ్‌ గేమ్స్‌ .. ఫస్ట్‌ సీజన్‌ ఎండ్‌ అవుతుంది.

ఈ కథనం అంతా గతం, వర్తమానం.. బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌గా సాగుతుంది. ఎనభై, తొంభైల సాంఘిక, రాజకీయ వాతావరణం, మతం.. రాజకీయాలకు ఒక  ఆయుధంగా మారడం, గోవు, గొడ్డు మాంసం మీదున్న అప్రకటిత నిషేధం, ఎమర్జెన్సీ టైమ్‌ నుంచి నేటి దాకా దేశంలోని పరిస్థితులు, సెక్స్, మనీ, పవర్‌ అకృత్యాలు, అండర్‌ వరల్డ్‌ అరాచకాలు, ముంబై స్లమ్స్‌లోని చీకటి కోణాలు..  రాజకీయాలకు  మాఫియా అండ.. రాజకీయనేతల అండతో మాఫియా వంటి పరస్పర ఆధారిత కార్యకలాపాలు..రెఫ్యూజీల కష్టాలు.. అన్నీటికీ అద్దం సేక్రెడ్‌ గేమ్స్‌. దీనికి ప్రాణం.. పర్‌ఫెక్ట్‌ స్క్రీన్‌ ప్లే.

‘‘మీరు వాల్మీకి రామాయణం చదివి పెరిగారు.. నేను రామానంద్‌ సాగర్‌ రామాయణం చూసి’’ వంటి డైలాగ్స్‌ ప్రాక్టికాలిటీకి స్క్రీన్‌ రూపం తీసుకున్నాయి. నవాజుద్దీన్‌ పోర్షన్‌కు అనురాగ్‌ కశ్యప్, సైఫ్‌ అలీ ఖాన్‌ పోర్షన్‌కు  విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌లో ఒక్కోదానికి పురాణ గాథల్లోని పేర్లను ఎంచుకున్నారు. మొదటి ఎపిసోడ్‌కు అశ్వత్థామ, రెండోదానికి హాలాహల, మూడోదానికి అతాపి వాతాపి, నాలుగోదానికి బ్రహ్మహత్య, అయిదో దానికి సరమ, ఆరోదానికి ప్రేతకల్ప, ఏడోదానికి రుద్ర, ఎనిమిదోదానికి యయాతి అని పేర్లు పెట్టారు. ఈ ఎనిమిది ఎపిసోడ్లు నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. సభ్యత్వం నమోదు చేసుకొని చూడొచ్చు.

– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement