ఎప్పటికీ రజనీకాంత్ అభిమానినే : సౌందర్య
‘‘రజనీకాంత్‌లాంటి మంచి వ్యక్తికి బిడ్డలం అయ్యుండి, మేం కనుక అణకువగా ఉండకపోతే మేం ఇడియట్స్ కింద లెక్క. మా నాన్న అందరితోనూ ఒకేలా ఉంటారు. అందర్నీ గౌరవిస్తారు. అందుకే ‘నీ హీరో ఎవరు’ అనడిగితే, మా నాన్న పేరే చెబుతా’’ అంటున్నారు సౌందర్య. సూపర్‌స్టార్ రజనీ రెండో కుమార్తె ఆమె. తండ్రి హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దాదాపు ఏ కూతురికీ రాదు.
అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నందుకు ఆనందంతో పాటు పెద్ద బాధ్యతగా భావించానని సౌందర్య పేర్కొన్నారు. తన తండ్రి హీరోగా తన దర్శకత్వంలో రూపొందిన ‘కోచడయాన్’ గురించి సౌందర్య మాట్లాడుతూ -‘‘త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. నేను అన్ని రకాల భాషల సినిమాలు చూస్తాను. కానీ ఎప్పటికీ రజనీకాంత్ అభిమానినే. ఆయనను దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. షూటింగ్ లొకేషన్లో ‘యాక్షన్’ చెప్పగానే, నాన్న పాత్రలో ఒదిగిపోయేవారు.
ఆయన అద్భుతమైన నటనకు ‘కట్’ చెప్పడం మర్చిపోయి, తన్మయత్వంతో చూస్తుండిపోయేదాన్ని. సీన్ పూర్తయిన తర్వాత మానిటర్‌లో చూసుకుని, ఆనందంతో చప్పట్లు కొడుతూ నా గదిలోకి వెళ్లిపోయేదాన్ని. నా తీరు చూసి నాన్న నివ్వెరపోయేవారు. ఓసారైతే మా అమ్మగారు ఫోన్ చేసి, ‘ఏ సీన్ తీస్తున్నావు?’ అనడిగారు. ఆరోజు హీరో, హీరోయిన్‌పై రొమాంటిక్ సీన్ తీస్తున్నాం. దాంతో ‘నాన్నతో రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నా’ అని అమ్మకి చెప్పాను. అప్పుడు మాత్రం అదోలా అనిపించింది.
ఓ కూతురిలా ఈ షూటింగ్ లొకేషన్‌లో నాన్నకి అన్ని సౌకర్యాలు సమకూరేలా చూసుకున్నాను. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి, షూటింగ్ చేసేదాన్ని. అలాగే ఓ దర్శకురాలిగా టైమ్‌కి షూటింగ్ పూర్తయ్యేలా చూసుకునేదాన్ని. ఓ అభిమానిగా ఆయన నటనను ఎంజాయ్ చేసేదాన్ని. నేనూ నాన్న అభిమానినే కాబట్టి, అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా ఆవిష్కరించాను. నాన్నతో సినిమా చేయడం జీవితంలో ఓ మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు.