
సాక్షి, సినిమా : అతను ఆగర్భశ్రీమంతుడు.. అయినా సరే ఆడంబరాలకుపోడు! రాకుమారుడైనా కఠినరాతిపై పవళించేందుకు వెనుకాడడు!! అతనికి పేదలంటే ప్రాణం. పేదలను దోచుకునే పెద్దలంటే అసహ్యం. ఆ భావనలోనుంచి పుట్టుకొచ్చిన ఆవేశం పాటలా మారితే? అవును, తన అప్‌కమింగ్ మూవీ ‘అజ్ఞాతవాసి’ కోసం ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిందిగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న పాట సరిగ్గా అలానే ఉంది.
‘అజ్ఞాతవాసి’ తనదైన శైలిలో డబ్బున్న మారాజులను దెప్పిపొడుస్తున్నట్లుగా ఉన్న ఆ పాట.. ‘‘కొడుకా కోటేశ్వర్‌రావు.. బంగళాలు వదిలేసి బైటికొచ్చి చూడరా..’ అని మొదలవుతుంది. ‘కొడుకా కోటేశ్వర్‌రావు.. కారులోంచి బైటికొచ్చి కళ్లు తెరిచి చూడరా..’ తరహాలో కొనసాగుతుంది. అయితే ఒరిజినల్ పాట ఇదేనా, కాదా అన్న విషయం తేలాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే. ‘అజ్ఞాతవాసి’ కోసం పీకే పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
పవన్ చాలా ఏళ్లుగా తన సినిమాల్లో ఒకటీ అరా పాటలు పాడుతుండటం, వాటికి విపరీతమైన ఆదరణ లభిస్తుండటం తెలిసిందే. ఇంతకుముందు త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా..’ పాట ఏరేంజ్‌లో హిట్టైందీ విదితమే. ఇక మరికొద్దిరోజుల్లో విడుదలయ్యే కొత్త పాటపైనా అంచనాలు చాలానే ఉన్నాయి. పవన్ 25వ సినిమా ‘అజ‍్క్షాతవాసి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్, అను ఇమ్మానుయెల్ ఈ సినిమాలో హీరోయిన్లు. అనిరుథ్ స్వరపర్చిన పాటలు ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)