అత్యాశవాసి.. సారీ అజ్ఞాతవాసికి ఇప్పుడు జై సింహ తోడయ్యాడు. ఒకరేమో అధికార పార్టీకి మిత్రసేనుడిగా సుపరిచితుడు.. ఇంకొకరేమో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే.. అందునా.. స్వయానా సీఎం చంద్రబాబుకు బావమరిది, మంత్రి లోకేష్‌కు మామ.. ఇంకేం.. మిత్రసేనుడి సినిమాకు ఇచ్చినట్లే.. బంధుజనుడి సిన్మాకూ ఉదారంగా అదనపు షోలకు అనుమతులిచ్చేశారు. ఐదు రోజులపాటు ఏకధాటిగా సదరు సిన్మా ఆడించేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసేసింది. థియేటర్లు ఫుల్ అయినా.. కాకున్నా పోటీపడి వరుసగా ఏడు షోలు ఆడించడం వల్ల కలెక్షన్ల దందా ఏమో గానీ.. ఏమాత్రం రెస్ట్ లేకుండా పని చేస్తున్న థియేటర్ల సిబ్బంది మాత్రం చెప్పుకోలేని ‘హింస’ అనుభవిస్తున్నారు. పండుగపూట ఇంటిపట్టున ఉండనివ్వకుండా అదనపు షోలతో సేవ చేయించుకున్నందుకు తగిన ఆర్థిక ప్రతిఫలం విషయాన్ని మాత్రం అటు సర్కారు గానీ.. ఇటు యాజమాన్యాలు గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పవన్ స్టార్ అజ్ఞాతవాసి మాదిరిగానే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహ సినిమాకు కూడా సర్కారు ఇష్టారాజ్యంగా ఏడు షోలకు అనుమతినిచ్చేసింది. ఏదో ఒక్క రిలీజ్ రోజు కాకుండా ఏకంగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 24 గంటలూ బొమ్మ ఆడించుకోవచ్చని సర్కారు తెర ఎత్తేయడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే అజ్ఞాతవాసికి వరుసగా వారంరోజుల పాటు ఏడు షోలకు అనుమతివ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక సినిమా టికెట్ల రేట్లు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఈ రెండు సినిమాలు ఆడే థియేటర్లలో టికెట్ల రేట్లు ఏకంగా రూ.200కి పెంచేశారు. సినిమా టాక్ ఎలా ఉన్నా కేవలం పండుగ రోజుల్లో దండుకునే పర్వానికి తెర లేపేందుకే 24గంటలూ షోలకు అనుమతిచ్చారన్నది నిర్వివాదాంశం.
నాలుగు షోలకే జనం లేరట!..
ఏకంగా ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకుని ఏడు షోలు వేసుకున్నా చూసే వాడే లేకుంటే?!.. ప్రస్తుతం అజ్ఞాతవాసికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సినిమాపై డివైడ్ టాక్‌తో మామాలుగా నాలుగు షోలకే హాలు నిండే పరిస్థితి లేదంటున్నారు. హైప్ క్రియేట్ చేసి భారీ అంచనాలతో రిలీజ్ చేసినా మొదటిరోజు తప్ప ఆ తర్వాత ఏడు షోలకూ టికెట్లు తెగట్లేదని ధియేటర్ల సిబ్బంది చెబుతున్నారు. విశాఖ నగరంలోని చాలా థియేటర్లలో ఇదే పరిస్థితి కాగా.. పెందుర్తిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గురువారం సాయంత్రం పెందుర్తిలోని ఓ ధియేటర్‌లో టికెట్లు తెగక సినిమా ప్రదర్శనే నిలిపివేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
థియేటర్ల సిబ్బంది గోడు వినేదెవరు?..
ఏడు షోలతో ఆయా సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టడం(?) ఏమో గానీ ధియేటర్ల ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అల్లాడిపోతున్నారు. సాధారణంగా రోజుకి నాలుగు షోలు ఆడే థియేటర్‌లో ఒకేసారి ఏడు షోలు ఆడిస్తున్నా.. సిబ్బందిని మాత్రం యాజమాన్యాలు పెంచలేదు. పోనీ కనీసం వారి వేతనాలు కూడా పెంచలేదని తెలుస్తోంది. కేవలం వారం రోజులేగా పనిభారం.. అన్న భావనలో ధియేటర్ల యజమానులు ఉన్నారు. అదనపు షోలకు ఉదారంగా అనుమతులిచ్చిన ప్రభుత్వం సైతం సిబ్బంది పనిభారం, అదనపు వేతనాల చెల్లింపు విషయాన్ని పట్టించుకోలేదు. కలెక్షన్లు ‘ఫుల్లు’ గా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పటికైతే ఒక సినిమా పరిస్థితి తేలిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కేవలం పండుగ మూడురోజుల కలెక్షన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక బాలకృష్ణ సినిమా ఫలితం నేడు తేలనుంది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా... ఏడు షోల దెబ్బకు రాత్రనక, పగలనక సిబ్బంది పనిభారంతో ‘హింస’ పడుతున్నారన్నది వాస్తవం.
అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేత
పెందుర్తి: అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్‌తో పెందుర్తిలోని లక్ష్మికాంత్ థియేటర్ యాజమాన్యం జైసింహా సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిలుపుదల చేసింది. అజ్ఞాతవాసి కోసం రెండు రోజుల ముందుగా బుధ, గురువారాల ఆటలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారు థియేటర్ వాళ్లకే టికెట్లు తిరిగి ఇచ్చేశారు. తిరిగి డబ్బులు కూడా అడగలేదు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు. కొందరైతే హాల్ ముందే రూ.200 టికెట్‌ను రూ.20, రూ.30కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో శుక్రవారం విడుదల అయిన జైసింహా పరిస్థితి కూడా ఇదే అయితే ప్రేక్షకులు తమ థియేటర్‌కు ఏ హాని తలపెడతారో అన్న భయంతో యాజమాన్యం జైసింహాకు అడ్వాన్స్ బుకింగ్‌ను పూర్తిగా రద్దు చేసింది.
శుక్రవారం ఉదయమే కౌంటర్‌లో టికెట్లు అమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుత కాలంలో థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేయడం ఎక్కడా లేదు. మరోవైపు గురువారం సాయంత్రం లక్ష్మికాంత్ హాల్‌లో ప్రేక్షకులు రాకపోవడంతో రెండు స్క్రీన్లలో ఆటలు రద్దు చేశారు. రెండు స్క్రీన్లకు కలిపి పది మంది మాత్రమే వచ్చారు. ఈ థియేటర్ ప్రారంభం నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు లేక ఆటను రద్దు చేయడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment