
‘‘కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకే ఆస్కార్ అవార్డులు వస్తాయన్నది అపోహ. తక్కువ బడ్జెట్‌తో, కథాబలంతో తీసే సినిమాలకు అవార్డు దక్కించుకునే అర్హత ఉంటుంది. ఆస్కార్ అవార్డుకి కలక్షన్స్‌తో సంబంధం లేదు’’ అని ఆస్కార్ ఇండియా జ్యూరీ కమిటీ అధ్యక్షులు సీవీ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్ పోటీలకు మన దేశం నుంచి ‘ఉత్తమ విదేశీ’ చిత్రాల కేటగిరీకి హిందీ చిత్రం ‘న్యూటన్’ని ఎంపిక చేశారు.
రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అంజలీ పాటిల్ ముఖ్య తారలుగా అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై, మంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీవీ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తక్కువ బడ్జెట్‌తో తీసిన ‘న్యూటన్’ ఉన్నతంగా ఉంది. అందుకే ఏకగ్రీవంగా ఈ సినిమాను ఎంపిక చేశాం. తెలుగు ‘బాహుబలి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో పాటు కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల నుంచి రెండేసి సినిమాలు, పన్నెండు హిందీ సినిమాలు, ఐదు మరాఠీ సినిమాలు ఒక తమిళ సినిమా.. ఇలా మొత్తం 26 సినిమాలు ఎంట్రీకి వచ్చాయి. తెలుగుతో పోలిస్తే మరాఠీ, బెంగాలీ భాషల సినిమాలు బాగున్నాయి’’ అన్నారు. ‘‘ఆస్కార్ అవార్డులకు పోటీ పడే చిత్రాలకు ఇకనుంచి ప్రభుత్వం కోటీ రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది’’ అన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి. కల్యాణ్
‘న్యూటన్’ కథేంటి?: న్యూటన్ కుమార్ ఓ గవర్నమెంట్ క్లర్క్. నిజాయతీకి చిరునామా అతను. ఛత్తీస్‌గడ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంతో అతనికి ఎన్నికల నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. ఎలక్షన్ డ్యూటీలో ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఎన్నికలు సజావుగా సాగడానికి న్యూటన్ కుమార్ ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమా తీశారు. విడుదలైన రోజే ఈ సినిమాని పలువురు చిత్రరంగ ప్రముఖులు చూశారు. ‘‘ఈ సినిమా ఓ కనువిప్పు’’ అని అమితాబ్ పేర్కొన్నారు. అక్షయ్‌కుమార్ కూడా ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆస్కార్ నామినేషన్ పోటీకి అర్హత ఉన్న చిత్రమిది అని పలువురు సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ సినిమా అందుకుంటోంది. మరి.. ఆస్కార్‌లో నామినేషన్ దక్కించుకుని, ఆ తర్వాత అవార్డు కూడా దక్కించుకుంటుందా? వేచి చూద్దాం.