
ఆస్పత్రికి వెళ్లడం ఏమాత్రం ఆలస్యమైనా తాను కోమాలోకి వెళ్లేవాడినని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ అన్నాడు. డయాబెటిస్ కారణంగా అందరికీ శాశ్వతంగా దూరమైపోతాననే భయం తనను వెంటాడేదని పేర్కొన్నాడు. టీనేజ్‌లో ఉండగానే నిక్ డయాబెటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మంగళవారం ఓ మ్యాగజీన్‌తో నిక్ మాట్లాడుతూ..‘13 ఏట బాగా బరువు తగ్గడం ప్రారంభమైంది. శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పుడు అమ్మానాన్న డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తే... నాకు టైప్-1 డయాబెటిస్ వచ్చిందని చెప్పారు. ఆనాటి నుంచి.. నాకేమైనా జరుగుతుందా? నేను బాగానే ఉంటానా? నేను సాధించాలనుకున్న లక్ష్యాలకు డయాబెటిస్ అడ్డంకిగా మారుతుందా? అనే ఎన్నో సందేహాలు వెంటాడేవి. నేను బాగానే ఉంటాను కదా అని మా తల్లిదండ్రులను పదేపదే అడిగేవాడిని. ఆనాడు ఒక్కరోజు ఆలస్యంగా ఆస్పత్రిలో చేరినా నేను కోమాలోకి వెళ్లేవాడిని. తర్వాత వైద్యుల సలహాలు, సూచనలతో డయాబెటిస్ చాలా చిన్న వ్యాధి అని, ఆరోగ్యకరమైన జీవనశైలితో దానిని అదుపు చేసుకోవచ్చని తెలుసుకున్నా అని తన టీనేజ్ నాటి సంగతులను చెప్పుకొచ్చాడు.
కాగా ప్రియాంక చోప్రాతో ప్రేమలో పడిన నిక్ జోనస్ గతేడాది డిసెంబరులో ఆమెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో నెటిజన్లు నేటికీ ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసినప్పుడల్లా అభ్యంతరకర వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారు. ప్రియానిక్ జంట మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆనందంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక నిక్ సంగీత ప్రదర్శనలతో బిజీగా ఉండగా.. ప్రియాంక స్కై ఈజ్ పింక్ అనే బాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.