నీహా అని పిలిస్తే పలికేది కాదు!
మహా గ్రంథాలను వర్ణించగలం గానీ... ప్రేమను నిర్వచించలేం. అదొక అంతులేని అగాథం... అందుకోలేని ఆకాశం. ఇంత క్లిష్టమైన ప్రేమను రెండున్నర గంటల సినిమాగా చూపించేందుకు ఎందరో ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందులో రామరాజు ఒకరు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి హృదయాన్ని హత్తుకునే సినిమా రూపొందించిన రామరాజు... ఇప్పుడు ‘ఒక మనసు’ అంటూ... మరో ప్రణయకావ్యాన్ని తెరకెక్కించారు. నేడు విడుదల కానున్న ఈ చిత్రవిశేషాలను రామరాజు ఇలా చెప్పారు...
స్వార్థం తెలీనిది, షరతుల్లేనిదే స్వచ్ఛమైన ప్రేమ. నీ మీద ప్రేమ చావదు.. మరొకరి మీద ప్రేమ పుట్టదంటారు నిజమైన ప్రేమికులు. ఒక మనసు కథలో చెప్పిందిదే. ప్రేమ అనేది ఒక స్థితి (కండీషన్). ఇది ఒక గంటా, ఒక రోజా, ఒక నెలా అనేదాన్ని బట్టి ప్రేమ లోతు చెప్పొచ్చు. ఇదే ప్రేమ జీవితాంతం నిలుపుకుంటుందిసంధ్య. ఈ పాత్రను నీహారిక అద్భుతంగా చేసింది. కథ పరంగా కథానాయకుడి పాత్ర కంటే సంధ్య పాత్రకే కాస్త ప్రాధాన్యం ఉంటుంది. సంధ్య పాత్రలో నిహారిక, సూర్య క్యారెక్టర్లో నాగశౌర్య వాళ్ల నటనతో దర్శకుడిగా నా ఊహలకు రూపమిచ్చారు. నా గత చిత్రం లాగే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. నీహారిక అనగానే మొదట కొంచెం టెన్షన్ ఉండేది. మెగా కుటుంబం నుంచి వస్తోన్న అమ్మాయి కదా, చాలా అబ్జెక్షన్స్ ఉంటాయేమో అనుకున్నా. కానీ ‘సంధ్య’ పాత్రకు ఆమె కరెక్ట్ అనిపించి, తన తల్లిదండ్రుల సమక్షంలో కథ వినిపించా. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఇంతటితో వదిలేద్దాం అని చెప్పా. కానీ, ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆమె ‘సంధ్య’ పాత్రలో ఎలా లీనమైందంటే.. సెట్‌లో ‘నీహా’ అని పిలిస్తే పలికేది కాదు.. సంధ్య అంటేనే పలికేది.
నాగశౌర్య అప్ కమింగ్ యువ రాజకీయ నాయకునిగా ‘సూర్య’ పాత్రలో కనిపిస్తాడు. తన పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. సమాజంలోనే కాదు.. మన జీవితాల్లో కూడా రాజకీయం ఉందనే విషయం తన పాత్ర ద్వారా చెప్పాం. నా దృష్టిలో కమర్షియల్ చిత్రమంటే భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడం కాదు. తక్కువ బడ్జెట్‌లో చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబడితేనే అది అసలైన కమర్షియల్ చిత్రం. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రం కంటే ‘ఒక మనసు’ వేగంగా సాగుతుంది. ఈ సినిమా తర్వాత మధుర శ్రీధర్‌రెడ్డి బ్యానర్లోనే ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నా.