
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిఖిల్‌గౌడ రెండో చిత్రం?
సాక్షి,బెంగళూరు: తన మొదటి చిత్రమైన జాగ్వార్ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ఘనవిజయాన్ని అందుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం. తండ్రి జన్మదినం సందర్భంగా డిసెంబర్16న తన మొదటి చిత్రం జాగ్వార్‌ను మొదలుపెట్టిన నిఖిల్‌గౌడ అదే రోజునే తన రెండవ చిత్రాన్ని కూడా మొదలుపెట్టనున్నారని వినికిడి.
తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ హైవోల్టేజ్ చిత్రానికి కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా చిత్రంపై నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై నిఖిల్‌గౌడ, ఆయన తండ్రి హెచ్.డీ.కుమారస్వామిల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.