Nikhil kumar
-
ఒక జంటను వెంటాడే రోడ్ ట్రిప్ థ్రిల్లర్.. 'కరణ్ అర్జున్' రివ్యూ
టైటిల్: కరణ్ అర్జున్ నటీనటులు: అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్టర్ సునీత్, అనితా చౌదరి, రఘు. జి, జగన్, ప్రవీణ్ పురోహిత్ తదితరులు నిర్మాణ సంస్థ: రెడ్ రోడ్ థ్రిల్లర్స్ నిర్మాతలు: డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ దర్శకత్వం: మోహన్ శ్రీవత్స సంగీతం: రోషన్ సాలూర్ సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ వర్మన్ ఎడిటర్ : కిషోర్ బాబు విడుదల తేది: జూన్ 24, 2022 నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కరణ్ అర్జున్'. రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ: కరణ్ (నిఖిల్ కుమార్) తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్ ఎందుకు వెంబడించాడు ? అసలు ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? లారీ డ్రైవర్ ఎత్తుకెళ్లిన వృషాలిని అర్జున్ ఎందుకు కాపాడాడు ? చివరికి క్లైమాక్స్‌లో ఏం తెలిసింది ? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'కరణ్ అర్జున్' సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక రోడ్ ట్రిప్ నేపథ్యంతో సాగే కథ. గుప్పెడంత మనసుకి సముద్రమంత గాయం అయితే.. చివరకు ప్రాణాలు తీసే అంత క్రూరత్వం పనికి రాదు అని దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన నీతి సూత్రం బాగుంది. అమ్మాయి, అమ్మ మీద ప్రేమతో ఒకరి ప్రాణం తీయడం సరికాదనే అంశాన్ని దర్శకుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో చక్కగా చూపించారు. సినిమా అసలు కథలోకి వెళ్లేందుకు సమయం పట్టినా ఇంటర్వెల్ నుంచి చాలా ఆసక్తికరంగా, ట్విస్టులతో కథను బాగా నడిపించాడు. అనుకున్న కథను తెరపై థ్రిల్లింగ్‌గా ఆవిష్కరించి డైరెక్టర్ మోహన్ శ్రీవత్స సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సంగీతం, బీజీఎం పర్వాలేదనిపించింది. ఎవరెలా చేశారంటే? రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నిఖిల్ కుమార్, అభిమన్యు చక్కగా నటించారు. ఒకరు తల్లిని, మరొకరు అమ్మాయిని ప్రేమించే ప్రాత్రల్లో ఒదిగిపోయారు. హీరోయిన్ షిఫా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పవచ్చు. చాలాకాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన సునీత చౌదరి తన పాత్ర పరిధిమేర బాగా నటించింది. ఎడారిలో వచ్చే చేజింగ్ సీన్స్ఆకట్టుకుంటాయి. రాజస్థాన్ లొకేషన్స్‌ను అందంగా చూపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'కరణ్ అర్జున్' ఎంగేజింగ్‌గా ఉండే ఒక రోడ్ ట్రిప్ థ్రిల్లర్. -
కరణ్ అర్జున్ ట్రైలర్ చూశారా?
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కరణ్ అర్జున్. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా నెల 24న దాదాపు 186 థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో ప్రీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ..."మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్‌కు తగ్గట్టుగా సినిమా తెరకెక్కించాం. మంచి లొకేషన్స్ కోసం పాకిస్థాన్ బార్డర్లో ఎంతో కష్టపడి షూట్ చేశాము. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు కొత్తవారని చూడకుండా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలని కంటెంట్‌ను నమ్ముకుని చేసిన సినిమా ఇది. నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ చెయ్యాలనుకున్నాము. కానీ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు. నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ ఆకుల మాట్లాడుతూ…'ఈ సినిమా బాగా వచ్చింది. సుకుమార్, అనిల్ రావిపూడి, పరుశురాం తదితరులు మా సినిమాకు సపోర్ట్ చేశారు. వారికి మా ధాన్యవాదాలు. మేము విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది" అన్నారు. హీరో నిఖిల్ కుమార్ మాట్లాడుతూ..."ఇది మా నాన్న డ్రీమ్. నన్ను హీరోగా తెరపై చూడాలనుకున్నారు. మా నాన్న అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేకుండా ఫుల్ లవ్ & యాక్షన్ ఉంటుంది. చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది" అన్నారు. హీరో అభిమన్యు మాట్లాడుతూ.. 'ఆర్టిస్ట్ గా నాకిది మెదటి చిత్రమైనా నటనలో నేను ద బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇందులో హీరో, హీరోయిన్స్ ఉన్నా కంటెంటే హీరో' అన్నారు. చదవండి: బయోపిక్, బయోఫిక్షన్ మధ్య తేడా ఉంది: హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటుదాం: సీఎం -
రైడర్
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియస్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. కశ్మీరా పరదేశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: శ్రీష ఎం. కుడువల్లి. -
కౌంటింగ్‌పై శిక్షణ.. మూడంచెల భద్రత
సాక్షి, విజయవాడ : ఈవీఎం, వీవీప్యాట్లు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థుల వారిగా వీవీప్యాట్ స్లిప్పులను సాగ్రిగేట్చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా 25 వీవీప్యాట్ స్లిప్పులను ఒక బండిల్‌గా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆర్వోలు పూర్తిగా నిర్థారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. -
అక్కడ కూడా బోయపాటి స్టైల్లోనే తీశారా..?
సాండల్‌వుడ్‌లో ‘సీతారామ కళ్యాణం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీ ఎవరిది అనుకుంటున్నారా.. జాగ్వార్‌తో టాలీవుడ్‌ను పలకరించిన నిఖిల్ తన తదుపరి చిత్రం (సీతారామ కళ్యాణం) తో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా.. సేమ్ టు సేమ్ సరైనోడు సినిమాను దించేశారన్న కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్లో పలు తెలుగు సినిమా చాయలు కనిపిస్తుండగా.. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలతో హీరో విలన్లను చితక్కొట్టేస్తున్నాడు. కె.జి.యఫ్తో కన్నడ పరిశ్రమ స్థాయి పెరగ్గా.. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రవి శంకర్, శరత్ కుమార్‌లు కీలకపాత్రల్లో నటించగా.. రచితా రామ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా.. హర్ష దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కురుక్షేత్ర టీజర్ : అభిమన్యుడిగా నిఖిల్
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తనయుడు నిఖిల్ కథానయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కురుక్షేత్ర’ టీజర్‌ను శనివారం చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సినిమాలో పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడి పాత్రలో నిఖిల్ గౌడ అభిమానులను అలరించనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న రూ. 50 నుంచి 60 కోట్లు వ్యయం చేశారు. వృషభాద్రి ప్రొడక్షన్ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నాగణ్ణ. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్, క్రేజీస్టార్ రవిచంద్రన్, యాక్షన్‌కింగ్ అర్జున్, డైలాగ్ కింగ్ సాయికుమార్, కన్నడ నటుడు శశికుమార్, భారతీ విష్ణువర్ధన్ తదితరులు నటించారు. -
అభిమన్యుడిగా నిఖిల్ గౌడ
-
నయా... ఆగయా
ఇటీవల హీరోలుగా పరిచయమైన రోషన్, నిఖిల్‌కుమార్.. ఇద్దరిదీ పెద్ద బ్యాగ్రౌండే. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీయం హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ ‘జాగ్వార్’ ద్వారా తెలుగు, కన్నడ భాషల్లో పరిచయమయ్యాడు. మొదటి సినిమా కాబట్టి అద్భుతంగా నటిస్తాడని ఆశించలేం. అయితే బాగా కసరత్తులు చేస్తే మంచి మాస్ హీరో అనిపించుకుంటాడని సినీ పండితుల విశ్లేషణ. తండ్రి శ్రీకాంత్‌కి జిరాక్స్ కాపీలా ఉన్నాడు రోషన్. మొదటి సినిమాతోనే ఆకట్టుకోగలిగాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మతాబులు విరజిమ్మే కాంతులను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కొత్తగా తెరపైకొచ్చే కథానాయికలు కూడా మతాబుల్లాంటి వాళ్లే. ఈ ఏడాది ఇప్పటివరకూ డజను మంది కథానాయికలు పరిచయమయ్యారు. వీళ్లల్లో మలయాళ తారలు ఎక్కువగా ఉండటం విశేషం. థౌజండ్‌వాలా పేల్చినప్పుడు గుండె ఎలా అదురుతుందో ఈ అందగత్తెలను చూసి అబ్బాయిల గుండెలు అలానే అదిరాయి. మనసు మతాబులా విచ్చుకుంటే.. కళ్లు కాకరపువ్వొత్తులా కాంతులీనాయి. దీపావళి టపాసుల్లో చిచ్చుబుడ్డులకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్‌నే ఈ నాయికలు సంపాదించుకున్నారు. ‘నేను శైలజ’ ద్వారా పరిచయమైన కీర్తీ సురేశ్ మంచి కీర్తినే సంపాదించుకున్నారు. ‘అఆ’తో పరిచయమైన మలయాళ మతాబు అనుపమా పరమేశ్వరన్ ఇటీవల విడుదలైన ‘ప్రేమమ్’లోనూ భేష్ అనిపించుకున్నారు. ఇదే చిత్రం ద్వారా పరిచయమైన మరో మలయాళ టపాసు మడోన్నా సెబాస్టియన్ కూడా బూరెబుగ్గలతో భేషుగ్గానే కనిపించారు. ‘జెంటిల్మన్’లో నివేదా థామస్ అందచందాలు, అభినయం రెండూ పేలాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మెహరీన్ కొంచెం పుష్టిగా.. బాగా మందుతో కూరిన మతాబులా ఆకట్టుకుంది. ‘ఒక మనసు’ అంటూ మెగావారసులు నిహారిక కొణిదెల మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. మలబార్ తీరం నుంచి వచ్చిన నాయికల్లో ‘మజ్ను’తో పరిచయమైన అనూ ఇమ్మాన్యుయేల్ కూడా భేష్ అనిపించుకున్నారు. మరో మలయాళీ బ్యూటీ నమితా ప్రమోద్ ‘నైస్’ అనిపించుకున్నారు. నిక్కీ గర్లానీ, లారిస్సా బొనేసి, సోనమ్ బజ్వా, అదితీ ఆర్య వంటి న్యూ హీరోయిన్స్ కూడా తమ టాలెంట్‌ని చూపించుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా పది నెలల్లో 12 మంది నాయికలు పరిచయం కావడం అంటే... మన తెలుగు పరిశ్రమ పరభాషలవాళ్లను ఏ రేంజ్లో ప్రోత్సహిస్తోందో ఊహించుకోవచ్చు. సంవతర్సం మొదటి రోజున విడుదలైన ‘నేను శైలజ’ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలా పాజిటివ్ సైన్‌తో కొత్త సంవత్సరం మొదలైంది. ఆ తర్వాత ఫెస్టివల్ టైమ్‌లో రిలీజ్ కాకపోయినా విజయ విహారంతో పండగ చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ‘ఆఆ’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీరస్తు శుభమసు’్త, డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’. ‘ఆఆ’ని దాదాపు రూ.35 కోట్లతో తీస్తే.. అంతా కలిపి రూ.50 కోట్లకు పైగానే దక్కించుకుంది. సుమారు రూ.60 కోట్ల ఖర్చుతో తీసిన ‘జనతా గ్యారేజ్’ అన్నీ కలుపుకుని దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూలు చేసి, ఎన్టీఆర్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అల్లు శిరీష్ కెరీర్‌కి శుభమస్తు అయింది ‘శ్రీరస్తు శుభమస్తు’. ఇది కూడా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ కిందే లెక్క. ఇక.. ‘బిచ్చగాడు’ అయితే సూపర్. ఈ చిత్రం తెలుగు అనువాద హక్కులు రూ.50 లక్షల రూపాయలు. అయితే.. రూ.20 కోట్లు వసూలు చేసి, రికార్డ్ సృష్టించింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని ఈ ఏడాది నాని కెరీర్ తారాజువ్వలా పైపైకి ఎగిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్మన్’, ‘మజ్ను’... ఈ మూడు చిత్రాలూ మామూలు బడ్జెట్‌తో రూపొందినవే. కానీ, వసూళ్లు మాత్రం భారీగానే దక్కించుకున్నాయి. ముచ్చటగా మూడు విజయాలు అందుకుని, నాలుగో రిలీజ్‌కి రెడీ అవుతున్నాడు నాని. తన తాజా చిత్రం ‘నేనో రకం’ క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిఖిల్‌గౌడ రెండో చిత్రం?
సాక్షి,బెంగళూరు: తన మొదటి చిత్రమైన జాగ్వార్ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ఘనవిజయాన్ని అందుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం. తండ్రి జన్మదినం సందర్భంగా డిసెంబర్16న తన మొదటి చిత్రం జాగ్వార్‌ను మొదలుపెట్టిన నిఖిల్‌గౌడ అదే రోజునే తన రెండవ చిత్రాన్ని కూడా మొదలుపెట్టనున్నారని వినికిడి. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ హైవోల్టేజ్ చిత్రానికి కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా చిత్రంపై నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై నిఖిల్‌గౌడ, ఆయన తండ్రి హెచ్.డీ.కుమారస్వామిల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
మరోసారి హీరోగా జగ్గుభాయ్
ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విలన్‌గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నాడు. విలన్‌గా మారిన తరువాత తిరిగి హీరో పాత్రలకు దూరమైన ఈ సీనియర్ స్టార్ ఇప్పుడు మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం కన్నడలో నిఖిల్ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన భారీ చిత్రం జాగ్వర్లో నెగెటివ్ రోల్లో నటిస్తున్న జగ్గుభాయ్, నవంబర్ నుంచి తను హీరోగా తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జాగ్వర్ నిర్మాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కుమారస్వామి. జగపతిబాబు మంచి నటుడు మాత్రమేకాదు, ఆయన స్టార్ హీరో అన్న నిర్మాత, ఆయన ఏజ్‌కు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ దొరికిందని అందుకే వెంటనే సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం జాగ్వర్‌తో పాటు తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు జగపతిబాబు. -
నిఖిల్ హార్డ్‌వర్క్ స్పష్టంగా కనిపిస్తోంది : కేటీఆర్
‘‘భాషతో నిమిత్తం లేకుండా ప్రతిభ ఎక్కడ ఉన్నా అందర్నీ ప్రోత్సహించే అద్భుతమైన సంస్కృతి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సాంగ్స్, ట్రైలర్స్‌లో నిఖిల్‌కుమార్ హార్డ్‌వర్క్ కనిపిస్తోంది. తెలుగు, కన్నడ చిత్ర రంగాల్లో మరో ధృవతార రాబోతోందనడానికి ఇప్పటివరకూ చూసిన ప్రచార చిత్రాలే ఉదాహరణ. తాతయ్య, తండ్రి పేరుని నిఖిల్ నిలబెడతాడని, అతనికి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీయం హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రాన్ని ఎ.మహదేవ్ దర్శకత్వంలో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మించారు. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన పాటల సీడీలను, థియేట్రికల్ ట్రైలర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుకి ఈ వేదికపై దేవేగౌడ పది లక్షల రూపాయల చెక్ అందజేశారు. దేవేగౌడ మాట్లాడుతూ - ‘‘నా మనవడు నిఖిల్‌కుమార్‌ని ఆశీర్వదించడానికి కేటీఆర్, టీయస్సార్, ఇతర ప్రముఖులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా టీమ్‌కు చెందుతుంది. గతేడాది నుంచి నిఖిల్‌కి శిక్షణ ఇస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నిఖిల్ ఈ ఫిల్మ్ ఫీల్డ్‌ని ఎలా ఎంపిక చేసుకున్నాడో తెలీదు. ఫైట్స్ అవీ చేయడం చాలా టఫ్ టాస్క్. నిఖిల్ ఎంత కష్టపడ్డాడో స్వయంగా చూశాను. సక్సెస్ అవుతాడని ఆశీర్వదిస్తున్నాను. ప్రతి భారతీయుడూ టీవీల్లో సింధు మ్యాచ్ చూశారు. నేనూ మ్యాచ్ చూసి థ్రిల్ అయ్యా’’ అన్నారు. నిఖిల్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కి థ్యాంక్స్. దర్శకుడు మహదేవ్ ఏడాదిన్నర నుంచి చాలా కష్టపడుతున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘నిఖిల్‌కుమార్ ఓ ముడి వజ్రం. సాన పెడితే అద్భుతంగా ప్రకాశిస్తాడు. సినిమా చూశా. అద్భుతంగా ఉంది. రాజమౌళి అంతటి ప్రతిభావంతుడు అతని శిష్యుడు మహదేవ్ అని నమ్ముతున్నా. ఈ సినిమాతో తానేంటో రుజువు చేసుకుంటాడు’’ అన్నారు. ‘‘నిఖిల్‌కుమార్ సౌతిండియన్ సూపర్‌స్టార్ కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘గడ్డం నెరిసిన కొద్దీ గ్లామర్ వస్తోందంటున్నారు. రంగు వేసుకోవలసిన, గడ్డం గీసుకోవలసిన అవసరం లేదు. హ్యాపీగా ఉంది. బ్యాడ్ అయిన కొద్దీ గుడ్ జరుగుతోంది. సో, బ్యాడ్ విలన్‌గా ఉండిపోతాను. తెలుగు, కన్నడ అని కాకుండా నిఖిల్‌కుమార్‌ని మన ప్రేక్షకులు వెల్కమ్ చేసిన విధానం నాకు నచ్చింది. కుమారస్వామి బెస్ట్ సీయం అని అక్కడ అందరూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీయం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, సి.కల్యాణ్, ఎం.ఎల్.కుమార్ చౌదరి, అశోక్ కుమార్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, పారిశ్రామికవేత్త రఘురామరాజు, నటులు అలీ, రఘుబాబు, హీరోయిన్ దీప్తి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
పవన్ ముఖ్య అతిథిగా జాగ్వర్ ఆడియో
మాజీ ప్రధాని మనవడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు.. నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం అవుతోన్న భారీ చిత్రం జాగ్వర్. ఈ సినిమా ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను ఆదివారం హైదరాబాద్ లోని నొవాటెల్ హోటల్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను కూడా అదే స్థాయిలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుక హాజరవుతుండటంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హజరవుతారని భావిస్తున్నారు. దీనికి తోడు హీరో నిఖిల్ కుమార్ రాజకీయా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తుండటంతో రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మిత్రుడు సినిమాను డైరెక్ట్ చేసిన మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
కొత్త హీరోతో శృతి ఐటమ్ సాంగ్
తన కెరీర్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ చేసింది శృతి హాసన్. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కావటంతో కాదలేక ఆ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. తరువాత చాలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చినా.. నిర్మొహమాటంగా కాదనేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఐటమ్ నంబర్‌కు సై అంటోంది ఈ బ్యూటి. అది కూడా ఓ యంగ్ హీరో తొలి సినిమాలో స్పెషల్ సాంగ్‌కు ఓకె చెప్పింది.కన్నడలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న నిఖిల్ కుమార్ సరసన స్పెషల్ సాంగ్‌కు రెడీ అవుతోంది శృతి. కన్నడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి సినిమా కావటంతో పాటు, భారీగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేయటంతో శృతి ఈ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాగ్వర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. -
తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్..!
స్టార్ ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయం అవ్వాలంటే భయపడతారు. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్ లాంటి హీరోలు అలా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయమయ్యి నష్టపోయారు. ఈ ఇద్దరు హీరోలు పరిచయం అయ్యింది దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలతోనే. ఇప్పుడు ఈ రికార్డ్ లన్నింటినీ బ్రేక్ చేస్తూ తన తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్‌తో బరిలో దిగుతున్నాడు ఓ యంగ్ హీరో. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ కుమార్ జాగ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 75 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరిస్తున్న జాగ్వర్ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. కన్నడ మార్కెట్ పరంగా చూస్తే మాత్రం ఇంత భారీ బడ్జెట్ చాలా పెద్ద రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సినిమాలకు కథ అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకు కథ అందిస్తుండగా, బాలకృష్ణ హీరోగా మిత్రుడు సినిమాను తెరకెక్కించిన మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్న జాగ్వర్ ఫస్ట్ లుక్‌ను ఈ నెల 31న కన్నడ, తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. -
కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(75) నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించా యి. గవర్నర్‌గా ఆమె నియామకానికి సంబంధించిన విషయాన్ని మంగళవారం ఉదయం ఇక్కడ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసిన సందర్భంలోనే షీలాకు వివరించారని తెలిపాయి. ఇదిలావుంటే, దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా 1998 నుంచి 2013 వరకు ఉన్నారు.అదేవిధంగా 1984-89 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, ప్రస్తుత కేరళ గవర్నర్ నిఖిల్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి తలపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గత డిసెంబర్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఘోరపరాజయం పాలైన మూడు నెలల వ్యవధిలోనే దీక్షిత్ గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం.