‘‘భాషతో నిమిత్తం లేకుండా ప్రతిభ ఎక్కడ ఉన్నా అందర్నీ ప్రోత్సహించే అద్భుతమైన సంస్కృతి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సాంగ్స్, ట్రైలర్స్‌లో నిఖిల్‌కుమార్ హార్డ్‌వర్క్ కనిపిస్తోంది. తెలుగు, కన్నడ చిత్ర రంగాల్లో మరో ధృవతార రాబోతోందనడానికి ఇప్పటివరకూ చూసిన ప్రచార చిత్రాలే ఉదాహరణ. తాతయ్య, తండ్రి పేరుని నిఖిల్ నిలబెడతాడని, అతనికి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీయం హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాగ్వార్’.
ఈ చిత్రాన్ని ఎ.మహదేవ్ దర్శకత్వంలో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మించారు. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన పాటల సీడీలను, థియేట్రికల్ ట్రైలర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుకి ఈ వేదికపై దేవేగౌడ పది లక్షల రూపాయల చెక్ అందజేశారు. దేవేగౌడ మాట్లాడుతూ - ‘‘నా మనవడు నిఖిల్‌కుమార్‌ని ఆశీర్వదించడానికి కేటీఆర్, టీయస్సార్, ఇతర ప్రముఖులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా టీమ్‌కు చెందుతుంది. గతేడాది నుంచి నిఖిల్‌కి శిక్షణ ఇస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నిఖిల్ ఈ ఫిల్మ్ ఫీల్డ్‌ని ఎలా ఎంపిక చేసుకున్నాడో తెలీదు. ఫైట్స్ అవీ చేయడం చాలా టఫ్ టాస్క్. నిఖిల్ ఎంత కష్టపడ్డాడో స్వయంగా చూశాను. సక్సెస్ అవుతాడని ఆశీర్వదిస్తున్నాను.
ప్రతి భారతీయుడూ టీవీల్లో సింధు మ్యాచ్ చూశారు. నేనూ మ్యాచ్ చూసి థ్రిల్ అయ్యా’’ అన్నారు. నిఖిల్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కి థ్యాంక్స్. దర్శకుడు మహదేవ్ ఏడాదిన్నర నుంచి చాలా కష్టపడుతున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోంది’’ అన్నారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘నిఖిల్‌కుమార్ ఓ ముడి వజ్రం. సాన పెడితే అద్భుతంగా ప్రకాశిస్తాడు. సినిమా చూశా. అద్భుతంగా ఉంది. రాజమౌళి అంతటి ప్రతిభావంతుడు అతని శిష్యుడు మహదేవ్ అని నమ్ముతున్నా.
ఈ సినిమాతో తానేంటో రుజువు చేసుకుంటాడు’’ అన్నారు. ‘‘నిఖిల్‌కుమార్ సౌతిండియన్ సూపర్‌స్టార్ కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను’’ అన్నారు బ్రహ్మానందం. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘గడ్డం నెరిసిన కొద్దీ గ్లామర్ వస్తోందంటున్నారు. రంగు వేసుకోవలసిన, గడ్డం గీసుకోవలసిన అవసరం లేదు. హ్యాపీగా ఉంది. బ్యాడ్ అయిన కొద్దీ గుడ్ జరుగుతోంది. సో, బ్యాడ్ విలన్‌గా ఉండిపోతాను. తెలుగు, కన్నడ అని కాకుండా నిఖిల్‌కుమార్‌ని మన ప్రేక్షకులు వెల్కమ్ చేసిన విధానం నాకు నచ్చింది. కుమారస్వామి బెస్ట్ సీయం అని అక్కడ అందరూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సీయం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, దామోదర ప్రసాద్, సి.కల్యాణ్, ఎం.ఎల్.కుమార్ చౌదరి, అశోక్ కుమార్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, పారిశ్రామికవేత్త రఘురామరాజు, నటులు అలీ, రఘుబాబు, హీరోయిన్ దీప్తి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
నిఖిల్ హార్డ్‌వర్క్ స్పష్టంగా కనిపిస్తోంది : కేటీఆర్
Published Mon, Sep 19 2016 12:02 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement