8న నిప్పురా అంటున్న విక్రమ్‌ప్రభు
తమిళసినిమా: యువ నటుడు విక్రమ్‌ప్రభుకు ఇప్పుడో హిట్ చాలా అవసరం. నటుడిగా ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవకపోయినా, ఇటీవల తను నటించిన చిత్రాలు అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయాయన్నది మాత్రం వాస్తవం. అయితే నటుడిగా తానేమిటో తొలి చిత్రం కుంకీతోనే నిరూపించుకున్నారు. కాగా మరోసారి తన సత్తా చాటడానికి నెరుప్పడా(నిప్పురా) అంటూ రానున్నారు.విశేషం ఏమిటంటే ఈ చిత్రంతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. విక్రమ్‌ప్రభు నిర్మాతగా ఫస్ట్ ఆర్టిస్ట్ బ్యానర్‌ను ప్రారంభించి నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం నెరుప్పుడా.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రంలోని నెరుప్పుడా పాట ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యిందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా అలాంటి పవర్‌ఫుల్ టైటిల్‌కు ఆయన అనుమతి పొంది నిర్మించిన ఇందులో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ నిక్కీగల్రాణి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో వరుణ్, నాన్‌కడవుల్‌రాజేంద్రన్, నాగిరెడ్డి, ఆడుగళం నరేన్ నటించిన ఈ చిత్రాన్ని శ్యాన్ రోనాల్డ్ సంగీతం అందించారు. నవ దర్శకుడు ఏ.అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన ఇందులో విక్రమ్‌ప్రభు ఫైర్‌మ్యాన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్‌తో నెరుప్పుడా చిత్రం సెప్టెంబర్ 8వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.