ఇక నన్ను చెల్లెమ్మా అనరు
బాలతారగా పరిచయమైన మలయాళి కుట్టి శరణ్యా మోహన్. సినిమా చెల్లెమ్మగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో కథానాయకిగా నటిస్తోంది. అయితే చెల్లెమ్మ పాత్రల ముద్ర ఈ బ్యూటీని వెంటాడుతోంది. తన కొత్త సినిమాల విడుదల అనంతరం ఎవరూ చెల్లెమ్మా అనరంటోన్న శరణ్యామోహన్‌తో చిన్న భేటీ..
ప్రశ్న : సినిమా చెల్లెమ్మ ముద్ర నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నారు?
జవాబు : నిజం చెప్పాలంటే ఈ ఇమేజ్ రాత్రికిరాత్రి వచ్చింది కాదు. ఇందుకు చాలా కఠినంగా శ్రమించాను. బాల నటిగా ఉన్నప్పుడు చెల్లెలిగా అంగీకరించిన వారు ఇప్పుడు హీరోయిన్‌గానూ తప్పక ఆదరిస్తారు. ఒక్క అమ్మాయి అందరికీ చెల్లెలుగా ఉండగలదు. చెల్లెలు ప్రేమించ… కూడదా? డ్యూయెట్లు పాడరాదా? అన్నయ్యలను అభిమానించనీయండి ఇతరులు ప్రేమిస్తారు.
ప్రశ్న : ప్రస్తుతం చేస్తున్న చిత్రాలేమిటి?
జవాబు : ప్రస్తుతం పూర్తిగా హీరోయిన్‌గానే నటిస్తున్నాను. తమిళంలో కాదలై తవిర వేరొండ్రుమిలై్ల. కోలాహలం చిత్రంలో ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే అమ్మాయిగా నటిస్తున్నాను. ‘సుయం’ చిత్రంలో గ్రామీణ యువతి పాత్ర. ఈ చిత్రాల విడుదల తర్వాత నన్ను ఎవరూ చెల్లెమ్మా అనరు.
ప్రశ్న : టాప్ హీరోలందరికీ చెల్లెలిగా నటించారు. ఇప్పుడు వారితో ఎలా జతకడతారు?
జవాబు : బాలతారగా రజనీకాంత్‌తో కలసి నటించిన మీనా తర్వాత ఆయనతో జోడీ కట్టలేదా? సినిమాలో ఏదైనా సాధ్యమే. అలాగే నా విషయంలోనూ జరుగుతుంది.
ప్రశ్న : మీకంటే వెనుక వచ్చిన నజ్రియా, అమలాపాల్, లకీష్మమీనన్ లాంటి వారు దూసుకుపోతుండడం ఈర్ష్య కలిగించలేదా?
జవాబు : ఎందుకు ఈర్ష్యపడాలి. నాకంటే అందమైన అమ్మాయిలు సినిమాల్లోకి రాలేకపోతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. గురువాయురప్పన్ ఎవరికి ఎలా రాసి పెట్టి ఉన్నారో అలానే జరుగుతుంది.
ప్రశ్న : ఇప్పటి వరకు మీపై ఒక్క వదంతీ రాలేదే?
జవాబు : అందుకు మీడియా వాళ్లకు థ్యాంక్స్. సినిమా నేపథ్యం గురించి నాకు బాగా తెలుసు. బాలతారగా ఉన్నప్పటి నుంచే చూస్తున్నాను. ఎవరితో ఎంత వరకు సన్నిహితంగా ఉండాలో ఎవరినీ ఎంత దూరంలో ఉంచాలో తెలుసు.
ప్రశ్న : అయితే ప్రేమ వ్యవహారం లేనట్లేనా?
జవాబు : కొందరి పట్ల నేను ఆకర్షితురాలినయ్యాను. అయితే అది ప్రేమకు దారి తీస్తుందా? అనేది తెలియదు. అదే విధంగా వారెవరూ సినిమాకు చెందిన వాళ్లు కాదు.